ఇన్నాళ్లూ జనసేనకు ఉన్న లోటు కూడా తీరిపోయింది! పార్టీ సిద్ధాంతాలు, అధినేత పవన్ ప్రసంగాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సొంతంగా మీడియా వచ్చింది. దీంతో కొండంత అండ దొరికిందని జనసైనికులు సంబర పడుతున్నారు. కమ్యూనిస్టులతో పవన్ జతకడుతుండటం, ఇరు పార్టీల మధ్య భావసారూప్యత ఎక్కువగా ఉండటంతో కమ్యూనిస్టులకు చెందిన చానల్‌ను తమ అధీనంలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు జనసేన నాయకులు. మరి కమ్యూనిస్టులకు నిజంగానే ఈ చానల్‌ను పవన్ చేతుల్లో పెట్టడం వెనుక చాలా ఆసక్తికర పరిణామాలే ఉన్నాయం టున్నారు. ఈ బిజినెస్ డీల్ వెనుక అసలు కథ ఏంటి? ఏ పరిస్థితుల్లో తమ ఆధ్వర్యంలోని టీవీని పవన్ చేతుల్లో పెట్టారనే అవిషయాలను సీపీఐ సెక్రటరీ రామకృష్ణ బయటపెట్టారు.
పవన్‌తో కమ్యూనిస్టుల దోస్తీపై అనేక అనుమానాలు మొదటి నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలతో ఎన్నికల్లో జత కట్టేసిన కమ్యూనిస్టులకు ఇప్పుడు పవన్ మరో ఆశాదీపంలా కనిపిస్తున్నాడు. అలాగే ఒంటరిగా ఎన్నికలకు వెళతానని ప్రకటించిన పవన్.. కూడా కమ్యూనిస్టులతో దోస్తీకి ఇష్టపడుతున్నాడు. అయితే పవన్ తీసుకుంటున్న నిర్ణయాలతో కమ్యూనిస్టులు కొన్ని సందర్భాల్లో షాక్‌కు గురవుతున్నారు. దీంతో పవన్ వైఖరిపై స్పష్టమైన క్లారిటీ కోసం కమ్యూనిస్టు నాయకులు వేచి చూస్తున్నారు. ఇదే తరుణంలో రాష్ట్రంలో అన్ని మీడియా సంస్థలు కూడా పవన్‌కు సరైన కవరేజీ ఇవ్వడం లేదని జనసేన అభిమానులు నిరాశ చెందుతున్నారు. అధికార పార్టీకి మిత్రుడిగా ఉన్న సమయంలో ఇచ్చిన కవరేజీకి, సొంతంగా తిరుగుతున్న సమయానికీ మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ లోటు పూడ్చుకునేందుకు ఓ మీడియా చానెల్ ను అడాప్ట్ చేసుకున్నారు.
ఈ మధ్య జనసేన జనరల్ సెక్రెటరీ తోట చంద్రశేఖర్.. సీపీఐ నేతృత్వంలో నడుస్తున్న 99టీవీని కొనుగోలు చేశారు. జనసేనకు సపోర్ట్ గా నిలిచే మీడియా జాబితాలో ఇప్పుడు 99 టీవీ మొదటిస్థానంలో నిలవనుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ టీవీని దాదాపు రూ.15 కోట్లకు కొనుగోలు చేసినట్టు తోట చంద్రశేఖర్ తెలిపారు. దీనిపై ఏపీ సీపీఐ సెక్రెటరీ రామకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. కమ్యునిస్టు భావజాలంతో ముందుకెళ్తున్న తమ పార్టీకి ఇలా బిజినెస్ విషయాలను వెల్లడించి తోట ఇరుకునపెట్టాడని.. ఇలా 99టీవీ అమ్మకం విషయాలను బయటపెట్టడం భావ్యం కాదని ఆయన ఫైర్ అయ్యారు. సీపీఐ-జనసేన పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనుకుని భావిస్తున్నాయన్నారు.
`నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో 99టీవీ చాలా నష్టాల్లో ఉంది. దాని మీద సీపీఐ పార్టీ లక్షలు ఖర్చు చేస్తున్నా పరిస్థితి మెరుగుపడడం లేదు. ఎంతో కష్టపడి ఈస్థాయికి తీసుకొచ్చిన చానెల్ ను భారీ నష్టాల కారణంగా మూసివేయాలను కోలేదు. అందుకే ఈ నష్టాలను తగ్గించుకోవడానికి.. ఉద్యోగులను కాపాడుకోవడానికే 99 టీవీని జనసేనకు అమ్మాం` అని సీపీఐ రామకృష్ణ వివరణ ఇచ్చారు. ఈ అమ్మకం, కొనుగోలు వివాదాలు ఎన్ని వచ్చినా.. మొత్తంగా చూస్తే పవన్ కు ఏపీలో ఉన్న ఆదరణ, పవన్ ఫ్యాన్స్ వల్ల 99టీవీకి వైభవం రావడం ఖాయమంటున్నారు అనలిస్టులు. ఈ ఊపులో 99టీవీ నష్టాలు వీడి లాభాల్లోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. మరి పవన్ 99టీవీకి ఎంత సాయపడతాడో వేచిచూడాల్సిందే!!