పోలవరం నిర్మాణాల్లో కక్కుర్తి బయటపడింది. నిర్మాణాల్లో ముఖ్యమైన స్పిల్ వే నిర్మాణాల్లో చాలా చోట్ల నాసిరకంగా ఉందని కేంద్రం పర్యవేక్షణ కమిటి గుర్తించింది. పోలవరం నిర్మాణాల్లో నాణ్యతను తనిఖీ చేసేందుకు కేంద్రం నుండి నిపుణుల కమిటి వచ్చింది. రెండు రోజుల తమ పర్యటనలో హెడ్ వర్క్ లో ముఖ్యమైన స్పిల్ వే పనుల్లో నాణ్యత లోపాలను కమిటి గుర్తించి నిలదీయటం ఇపుడు సంచలనంగా మారింది. ఇదే విషయాన్ని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ఎప్పుడో ఫోటోలతో సహా బయటపెట్టినా ప్రభుత్వం అప్పట్లో కొట్టిపారేసింది. ఇపుడు అదే లోపాన్ని నిపుణుల కమిటి కూడా నిర్ధారించటంతో ప్రభుత్వం ఇరుకునపడింది.
సిమెంట్, స్టీలంతా నాసిరకమేనా ?
కాంక్రీట్ పనుల్లో కాంట్రాక్టర్లు వాడుతున్న సిమెంట్, స్టీలంతా నాసిరకమే అని అర్దమైపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కాంట్రాక్టర్లు వాడుతున్న సిమెంట్, స్టీలు తదితరాలను స్వయంగా ప్రభుత్వమే ప్రొక్యూర్ చేసి కాంట్రాక్టర్లకు సరఫరా చేస్తోంది. అంటే ప్రభుత్వం సేకరిస్తున్నవే నాణ్యతలో అత్యంత నాసిరకమని అర్దమవుతోంది. ఇంత నాసిరకం సిమెంట్, స్టీలుతో నిర్మించే నిర్మాణాలు అందునా భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎంత కాలం నిలుస్తాయనే అనుమానాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు నిపుణుల కమిటీ నాణ్యతను తప్పుపడుతుంటే ఇంకోవైపు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ చంద్రబాబు మండిపడుతుండటం విచిత్రంగా ఉంది.
నాణ్యతను ప్రశ్నిస్తే బదిలీలే
గతంలో కూడా స్పిల్ వే పనుల్లో నాణ్యతా లోపాలను గుర్తించి ప్రశ్నించిన ఉన్నతాధికారులను ప్రభుత్వం వెంటనే మార్చేసింది. కాంట్రాక్టర్లు చెప్పిన అధికారులనే ప్రభుత్వం పనుల పర్యవేక్షణకు నియమించటంతో నాణ్యతంతా గాలికి కొట్టుకుపోతోంది. జరుగుతున్న పనులను గమనించిన కమిటీ ఇక నుండి సెంట్రల్ సాయిల్ అండ్ రీసెర్చ్ మెటీరియల్ స్టేషన్ నిపుణులతో పర్యవేక్షిస్తామంటూ నిపుణుల కమిటీ ప్రకటించటం రాష్ట్రానికి ఇబ్బందే. మరి ఇప్పటికే జరిగిపోయిన నాసిరకం నిర్మాణాల విషయంలో నిపుణుల కమిటీ ఏం చేస్తుందన్నదే ప్రశ్న.
అంతా దోపిడీయేనా ?
పోలవరం కావచ్చు లేదా ఏ ఇతర భారీ పనులైనా కావచ్చు కాంట్రాక్టర్లు, ఉన్నతాధికారులు, పర్యవేక్షణ కమిటి అంతా చంద్రబాబునాయుడు కనుసన్నల్లో నడిచే వాళ్ళు ఉండటంతో ఎవరికీ దేనికి అడ్డం లేకుండా పోతోంది. అందుకే ఎక్కడబడితే అక్కడ దోచేసుకుంటున్నారు. ఇదంతా ఇలావుంటే ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ చేయని పనులకు ఇప్పటి వరకూ రూ. 101 కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం అంగీకరించటం గమనార్హం. అదనపు చెల్లింపులను రికవరీ చేయాలని తాజాగా ఉత్తర్వులివ్వటం విచిత్రంగ ఉంది.