అనంతపురం టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి తాజాగా జిల్లాలో కొత్త చిచ్చు రాజేశారు. వినాయక చవితి సందర్భంగా గణేష్ నిమజ్జనం తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్తతకు దారితీసింది. నియోజకవర్గంలోని చిన్నపొలమడలో గణేష్ నిమజ్జనం చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. అందుకు ట్రాక్టర్లను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే నిమజ్జనం చేయాలంటే గ్రామంలోనే ఉన్న ప్రబోధానందస్వామి ఆశ్రమం మీదుగానే వెళ్ళాలి.
తమ ఆశ్రమం ముందునుండి ట్రాక్టర్లను తీసుకెళ్ళటాన్ని నిర్వాహకులు అంగీకరించలేదు. అయితే నిర్వాహకుల అభ్యంతరాలను లెక్కచేయకుండా గ్రామస్తులు ట్రాక్టర్లను తెచ్చారు. ట్రాక్టర్లన్నీ ఆశ్రమం దగ్గరకు వచ్చిన తర్వాత నిర్వాహకులు అడ్డుకున్నారు. దాంతో నిర్వాహకులకు, గ్రామస్తులకు గొడవైంది. గ్రామస్తుల్లో జేసి సోదరుల మద్దతుదారులు కూడా ఉండటంతో గొడవ కాస్త పెద్దదైపోయింది. ఇంకేముంది ఆ గొడవలో చుట్టుపక్కలున్న ఆస్తులు, మొటారు బైకులు, షాపులు తగలబడ్డాయి. చివరకు పోలీసులొచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టారు.
అయితే, శనివారం జరిగిన గొడవలో గాయపడిన తమ వర్గం వారిని పరామర్శించేందుకు ఎంపి జేసి దివాకర్ రెడ్డి గ్రామానికి ఆదివారం మధ్యాహ్నం చేరుకున్నారు. ఎప్పుడైతే జేసి గ్రామానికి వచ్చారో అదే అదేనుగా మద్దతుదారులు మరోసారి రెచ్చిపోయి ఆశ్రమంపై రాళ్ళదాడికి దిగారు. ఆ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. విచిత్రమేమిటంటే అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్రమే పరిమితమయ్యారు. గ్రామస్తులపై ఆశ్రమ నిర్వాహకుల ధౌర్జన్యానికి నిరసనగా జేసి రోడ్డుపైనే భైఠాయించటంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు పోలీసులను జేసి అమ్మనాబూతులు తిట్టటమే ఈ ఎపిసోడు మొత్తానికి కొసమెరుపు.