బెజవాడ బెబ్బులిగా ఒకప్పుడు రాజకీయాలు చేసిన వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన వంగవీటి రాధాకు ఇప్పుడు గడ్డు పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రెండు ఎన్నికల్లో తీవ్రంగా ఓటమిని చవిచూసిన ఆయన వచ్చే ఎన్నికలపై చాలా ఆశలే పెట్టుకున్నారు. వచ్చే ఎన్ని కల్లోనూ గెలవకపోతే.. రాజకీయంగా ఆయన కనుమరుగైనా ఆశ్చర్యపడాల్సిన పనిలేదని అంటున్నారు. అయితే, ఇంతలోనే ఆయనపై ఉరుములు లేని పిడుగులా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ అధినేత జగన్ తీసుకున్నారని అంటున్న నిర్ణయం మరింత కలవర పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం(ఇక్కడ క్లాస్, మాస్ పీపుల్ కలయిక ఎక్కువ. పైగా వంగవీటికి సానుకూల పవనాలు ఉన్న జనాభా ఎక్కువగా ఉన్నారు) నుంచి పోటీ చేసి విజయం సాధించాలని రాధా నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా ఆయన ప్రిపేర్ చేసుకున్నారు.
యూత్‌ను చేరదీశారు. వారికి ఏకష్టమొచ్చినా ఆయన నేనున్నానంటూ.. వాలిపోతున్నారు. నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమా అరాచకాలపై తరచుగా మీడియాలోనూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎమ్మెల్యే చేసింది ఏమీ లేదని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కూడా పక్కా వ్యూహం సిద్ధం చేసుకున్నారు. టికెట్ ప్రకటించడమే ఆలస్యంగా ఆయన ప్రణాళిక కూడా రెడీ అయింది. అయితే, ఇంతలోనే జగన్ ఆయనకు టికెట్ ఇవ్వడం లేదని, సెంట్రల్ నియోజకవర్గం నుంచి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణుకు ఇచ్చేందుకు తెర వెనుక అంతా సిద్ధమైందని తాజాగా వార్తలు వచ్చాయి. అవి కూడా జగన్ సొంత పత్రిక సాక్షిలోనే రావడంతో వంగవీటి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నట్టుండి విజయవాడ మెయిన్ రోడ్డులో రాధా ఇంటి వద్ద ధర్నాకు సైతం దిగారు.
ఇక, ఈ క్రమంలో పరిస్థితి విషమిస్తోందని తెలుసుకున్న జగన్.. విశాఖ నుంచే రాధాకు ఫోన్ చేసి మాట్లాడారని, సంయమనం పాటించాలని సూచించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఒకింత వేడి తగ్గినా.. తర్వాత జరిగిన అనుచరులు, మిత్రుల సమావేశంలో వారిచ్చిన సలహా మేరకు ముదుకు వెళ్లాలని రాధా నిర్ణయించుకున్నట్టు తెలిసింది. దీని ప్రకారం.. వైసీపీలో ఉండి ప్రయోజనం లేదని వారు బాంబు పేల్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కడం, అధికారంలోకి రావడం వైసీపీకి ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదని, జగన్ ఇంతగా పాదయాత్ర చేస్తున్నా.. ఇండియాటుడే నిర్వహించిన సర్వేలో ఆయనకు కేవలం 43 మార్కులే పడ్డాయని వారు ఉదహరించారట.
అదేసమయంలో పవన్ చెంతకు చేరడం మంచిదని, వైసీపీలో ఉండి సెంట్రల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే బొండా ఉమాను ఎదుర్కొనడం కష్టమని, అదే పవన్ పార్టీ జనసేనలోకి వెళ్తే.. సునాయాసంగా విజయం సాధించడం సాధ్యమని వారు వివరించారట. అదేసమయంలో పవన్ ఏ టికెట్ ఇచ్చినా ఆయనే తన ఎమ్మెల్యేలను గెలిపించుకుంటారని కూడా రాధాకు అనుచరులు చెప్పినట్టు తెలిసింది. ఎలాగూ కొణిదల ఫ్యామిలీతోనూ రాధాకు మంచి సంబంధాలే ఉన్న నేపథ్యంలో టికెట్ గ్యారెంటీ అని చెప్పారట. అయితే, ఈ విషయాలన్నీ విన్న రాధా.. ఒకటి రెండు రోజులు వేచి చూసి.. నిర్ణయం తీసుకుందామని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి అనుచరుల ఐడియా అదిరిపోయిందనే వ్యాఖ్యలు మాత్రం వినిపిస్తున్నాయి.