పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీకి చెందిన సీనియర్‌రాజకీయ నాయకుడు, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపు గుర్రం ఎక్కిన ఎమ్మెల్యే. ఇక్కడ ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనా, నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం వేధించినా కూడా ఆయన అభివృద్ధిలో దూసుకుపోతున్నాడు. వచ్చే ఎన్నికల్లోనూ తనదే గెలుపుగా చెప్పుకొనే ధీమా ఉన్న నాయకుడుగా కూడా ఆయన గుర్తింపు పొందారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఈయనకు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్న అధికార టీడీపీ.. ఇక్కడ బాగానే గ్రౌండ్ వర్క్ చేసింది. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డిని ఓడించేందుకు ఓ మహిళా నేతను తెరమీదికి తెచ్చింది. ఈమె అయితేనే కరెక్ట్ అని నిర్ణయానికి కూడా వచ్చినట్టు సమాచారం.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున మహిళా నేత అనూషారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆ జిల్లాకు చెందిన పరిశ్రమల మంత్రి, వైసీపీ నుంచి 2014లో గెలుపొంది.. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు ఆకర్ష్ మంత్రంతో వైసీపీని విడిచి పెట్టి టీడీపీ సైకిల్ ఎక్కిన అమరనాథ్‌రెడ్డికి ఆమె స్వయానా మరదలు. కొద్ది రోజుల క్రితం ఆమెను పార్టీ అధినేత చంద్రబాబు పిలిపించి మాట్లాడారని సమాచారం. ఆ నియోజకవర్గానికి వైసీపీ సీనియర్‌నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ గట్టి అభ్యర్థి కోసం టీడీపీ దృష్టి పెట్టింది. ఆ నియోజకవర్గంలోని మూడు మండలాలతో అమరనాథ్ కుటుంబానికి రాజకీయ సంబంధాలున్నాయి.
నియోజకవర్గ పునర్విభజన తర్వాత ఆయన పలమనేరు వెళ్లారు. పుంగనూరులోని ప్రాంతాలతో ఉన్న రాజకీయ సంబంధాలను దృష్టిలో ఉంచుకొని అమరనాథ్ కుటుంబం నుంచి ఎవరినైనా పోటీకి పెడితే బాగుంటుందని టీడీపీ అధిష్ఠానం భావించింది. ఆ కోణంలో అనూష పేరు తెరపైకి వచ్చింది. కొద్ది రోజుల క్రితం ఆమెను... ఆమె భర్త శ్రీనాథరెడ్డిని చంద్రబాబు పిలిపించి వారి ఆసక్తి అడిగి తెలుసుకున్నారు.
దీనికి ముందు ఆ నియోజకవర్గ నేత, టీటీడీ పాలకమండలి సభ్యుడు బాబురెడ్డిని కూడా పిలిపించి మాట్లాడారు. అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేసినా సహకరించాలని, ఆయనకు ఇతరత్రా అవకాశాలు ఇస్తామని చెప్పారు. అయితే, బాబురెడ్డి ముభావంగానే అంగీకరించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహం ఫలిస్తే.. పుంగనూరు నుంచి లేడీ రెడీ అవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి పెద్దిరెడ్డి ఎలా డీల్ చేస్తారో చూడాలి.