ఎన్నిక‌ల వేళ పార్టీని ఐక్యంగా ముందుకు తీసుకు వెళ్లాల్సిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. తాజాగా తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. పార్టీని తీవ్రంగా కుదిపేస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీని నమ్ముకుని సేవ చేసి, ప్ర‌జ‌ల్లో విస్తృతంగా తిరిగిన వారిని కాద‌ని హ‌ఠాత్తుగా డ‌బ్బు లేద‌నే నెపంతోనే లేక మ‌రేదో కార‌ణంగానో అభ్య‌ర్థుల‌ను మార్చ‌డం  వ‌ల్ల పార్టీ బ‌లహీన ప‌డుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికే విజ‌య‌వాడ‌, గుంటూరు, క‌ర్నూలు ప‌రిస్థితి దారుణంగా ఉంటే.. తాజాగా ఇలాంటి ప‌రిణామ‌మే.. ఉత్త‌రాంధ్ర‌లోనూ చోటు చేసుకుంది. అత్యంత కీల‌క‌మైన ఐటీ రాజ‌ధాని విశాఖ‌లోనూ స‌మ‌న్వ‌య క‌ర్త‌ల‌ను చాలా తేలిక‌గా మార్చేస్తున్నారు జ‌గ‌న్‌.


ఇప్పటికే ఎలమంచిలి, విశాఖ ఉత్తరం, దక్షిణం సమన్వయకర్తలను తొలగించి కొత్తవారికి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్తగా కొత్తవారిని నియమించే యోచనలో ఉన్నట్టు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సమన్వయకర్తగా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావును వచ్చే ఎన్నికల్లో రూ.15 కోట్లు ఖర్చుపెట్టగలవా? అని పార్టీలో కీలక నేత ఒకరు నేరుగా ప్రశ్నించినట్టు సమాచారం. అంత మొత్తం ఖర్చుపెట్టలేనని బాబూరావు సమాధానం ఇవ్వడంతో...పక్కకు తప్పుకుంటే పార్టీ అధికారంలోకి రాగానే పెద్ద పదవి ఇస్తామని చెప్పినట్టుప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న బాబూరావు తన అనుచరుల వద్ద గోడు వెళ్లబోసుకున్నట్టు తెలిసింది. 


పార్టీ తీరుపై అసంతృప్తికి గురైన ఆయన్ను పార్టీకి చెందిన ఒక ఎంపీ ఫోన్‌ చేసి తొందరపడవద్దని సూచించినట్టు సమాచారం. పంచాయతీరాజ్‌ శాఖలో ఉన్నతస్థాయి అధికారిగా పనిచేసిన బాబూరావు తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్‌కు అత్యంత ఆప్తునిగా ప‌నిచేసిన ఆయ‌న త‌ర్వాత కాలంలో జ‌గ‌న్ వెంట న‌డిచారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2012లో జరిగిన ఉప ఎన్నికలో పాయకరావుపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో పాయకరావుపేట టిక్కెట్‌ను చెంగల వెంకట్రావు కేటాయించడంతో గొల్ల బాబూరావు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.


ఆ తరువాత పాయకరావుపేట సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించడంతో 2019 ఎన్నికల్లో తనకు టిక్కెట్‌ ఖాయమనే ధీమాతో ఉన్నారు. ఆ కారణంగానే గత ఏడాది తన కుటుంబాన్ని ఎస్‌.రాయవరం మండలం అడ్డరోడ్డుకి మార్చారు. నియోజకవర్గ పరిధిలో ఇటీవల జరిగిన జగన్‌ పాదయాత్రలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. కానీ, హ‌ఠాత్తుగా ఈనిర్ణ‌యం వెలువ‌డే స‌రికి ఆయ‌న  తీవ్రంగా మ‌ధ‌న ప‌డుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబూరావుకే టికెట్ ఇవ్వాల‌ని, ఆయ‌న‌ను గెలిపించుకునే బాధ్య‌త త‌న‌దేన‌ని అనుచ‌రులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి జ‌గ‌న్ నిర్ణ‌యాల‌తో పార్టీకి చేటు కాలం దాపురించింద‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: