రాజకీయం అంటేనే వ్యూహాలూ, ప్రతి వ్యూహాలు. ప్రత్యర్థిని అదను చూసి దెబ్బ కొట్టడంలోనే సక్సెస్ మంత్రం దాగుంది. మరిపుడు ఎన్నికల వేడి మొదలైపోయింది. గురి చూసి దెబ్బేయాలంటే ఇదే మంచి టైం. అందుకు అన్ని ఆయుధాలూ రెడీ చేసుకుంటున్నారు. కరెక్ట్ టైంలో ముగ్గులోకి లాగేయడమే మిగిలింది. సరిగ్గా మూడేళ్ళ క్రితం సంచలనం రేపిన ఓ కేసు ఇపుడు మళ్ళీ కదలబోతోందట.
అదే పిన్ పాయింట్ :
ఓటుకు నోటు కేసు మూడేళ్ళ క్రితం రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు, జాతీయ స్థాయిలో ఎంతలా హాట్ టాపిక్ అయిందో తెలిసిందే. ఆ కేసు వల్లనే చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమరావతికి షిఫ్ట్ కావాల్సివచ్చింది. ఆ కేసు తరువాత ఎన్నో కీలకమైన పరిణామాలు కూడా జరిగాయి. అప్పట్లో మోడీతో బాబు సఖ్యతగా ఉండడం వల్ల కేసులో కదలిక లేకుండా పోయిందని అంటారు. ఇక కేసీయార్ తోనూ రాజీ కుదిరిందనీ చెబుతారు. ఇపుడు అదే పిన్ పాయింట్ గా గురి పెట్టబోతున్నారట.
బాబుకి రిటార్ట్ :
ముందస్తు ఎన్నికలకు వెల్తున్న కేసీయార్ ని ఓడించేందుకు బాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం, మహా కూటమి అంటూ హల్ చల్ చేయడం వంటి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న కేసీయార్ పాత కేసును కొత్త ఆయుధంగా చేసుకోవాలని అనుకుంటున్నారని టాక్. ఈసారి కేసుకు మరో వైపు నుంచి నరుక్కు వస్తారని చెబుతున్నారు. ఓటుకు కేసుకు సంబంధించి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఇంట్లో దొరికిన యాభై లక్షలు కాకుండా మొత్తం డీల్ ప్రకారం మిగిలిన నాలుగున్నర కోట్ల నోట్ల కట్టలు ఎక్కడ నుంచి వచ్చాయి , ఏమా కధ అన్న కోణం నుంచి విచారణకు స్కెచ్ గీశారని చెబుతున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి వీడియోల సాక్షిగా స్టీఫెన్ సన్ ఇంట్లో పట్టుబడిన సంగతి తెలిసిందే.
అయితే ఈ డీల్ కు అవసరమైన ఐదు కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయి?. మిగిలిన 4.5 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టారు? అన్నది తేలాల్సి ఉంది. 50 లక్షలు స్టీఫెన్ సన్ ఇంటికి చేర్చారు. అయితే మిగిలిన 4.5 కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయి..ఎక్కడ ఉన్నాయో తేల్చాల్సిందిగా తెలంగాణకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ)తో పాటు కేంద్ర సంస్థలను కోరుతూ లేఖ రాసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ లేఖతో ఈడీ ఒక్కటే రంగంలో దిగుతుందా? ఇతర ఏజెన్సీలు కూడా వస్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఈ వ్యవహారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కొత్త సమస్యలు సృష్టించే అవకాశం కన్పిస్తోంది.