నాలుగు రోజులుగా విశాఖపట్నం జిల్లాలోని ఫిరాయింపు ఎంఎల్ఏ గిడ్డి ఈశ్వరి వణికిపోతున్నారు. మొన్నటి ఆదివారం మధ్యాహ్నం సహచర ఫిరాయింపు ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపేసిన దగ్గర ఉండి గిడ్డి కి ప్రాణభయం పెరిగిపోయిందని సమాచారం. దానికితోడు ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న ప్రచారం కూడా గిడ్డి ఆందోళనను పెంచేస్తోంది.
వైసిపి తరపున గెలిచిన కిడారి ఏడాదిన్నర క్రితం టిడిపిలోకి ఫిరాయించారు. వైసిపిలో ఉన్నంత కాలం కిడారి ప్రభుత్వ విధానాలపై పోరాటం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రధాన సమస్యలేమిటంటే మైనింగ్ తవ్వకాలే. బాక్సైట్ తదితర గనుల కోసం తవ్వకాలు మొదలుపెడితే మన్యం ప్రాంతం మొత్తం నాశనమైపోతుందని గిరిజనులు దశాబ్దాల నుండి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. వారి ఆందోళనలకు ఎవరైతే మద్దతుగా నిలబడుతారో వారికే గిరిజనులు కూడా ఓట్లేస్తారు. ఆ విధంగానే కిడారి, గిడ్డి మొన్నటి ఎన్నికల్లో గెలిచారు.
ఎప్పుడైతే కిడారి టిడిపిలో చేరారో అప్పటి నుండి ప్లేటు ఫిరాయించారని ఆరోపణలు మొదలయ్యాయి. టిడిపిలో చేరిన తర్వాత ఆర్దిక ప్రయోజనాల కోసం గిరిజనుల ప్రయోజనాలకు భిన్నంగా స్టాండ్ తీసుకున్నారట. దాంతో గిరిజనుల్లో మండింది. అదే విషయం మావోయిస్టులకు కూడా చేరింది. దాంతో మావోయిస్టులు మొన్న ఆదివారం మాట్లాడుకుందాం రామ్మని చెప్పి కాల్చి చంపేశారు.
సరిగ్గా గిడ్డి ఈశ్వరి కూడా ఇదే పద్దతిలో వెళుతున్నారు. కిడారి లాగే ఆమె కూడా టిడిపిలోకి ఫిరాయించిన తర్వాత గిరిజనుల నుండి ఆమె కూడా చీత్కారాలను భరించాల్సి వస్తోంది. గిరిజనులు గిడ్డి కార్యక్రమాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో గెలుపుపై గిడ్డిలో ఆందోళన మొదలైందట. అదే సమయంలో మావోయిస్తుల చేతిలో కిడారి హత్య ఘటన ఆమెలో టెన్షన్ మరంత పెంచేస్తోందట. ఎందుకంటే, కిడారి వైసిపిలోనే ఉండుంటే ప్రాణాలు పోయేవి కావనే ప్రాచారం గిడ్డిపై బాగా ప్రభావం చూపుతోందట.
దానికితోడు ఆమె ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయటం కూడా ఆమెలో టెన్షన్ పెంచేస్తోంది. ఆమెకున్న గన్ మెన్లను కూడా ప్రభుత్వం పెంచింది. ఏజెన్సీ ఏరియాల్లో తిరగటంపై పోలీసు ఉన్నతాధికారులు ఆంక్షలు విధించారు. ఏ క్షణంలోఏమవుతుందో అన్న భయం మాత్రం నీడలా గిడ్డిని వెన్నాడుతోంది. దాంతో గిడ్డి స్వేచ్చగా బయట తిరగలేకపోతున్నారు, అలాగని ఇంట్లోనే ఎంతకాలం కూర్చోవాలో అర్ధంకాక అవస్తలు పడుతున్నారట.