చివరి నిముషంలో జనసేన అధినేత పవన్ కల్యాన్ కు
పోలీసులు పెద్ద షాకే ఇచ్చారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజిపై కవాతుకు అన్నీ ఏర్పాట్లు
సిద్ధం చేసుకున్న తర్వాత పోలీసులు అడ్డుకున్నారు. బ్యారేజిపై కవాతు ఎంతమాత్రం
క్షేమకరం కాదంటూ పోలీసులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు. మరి కాసేపట్లో బ్యారేజిపై
కవాతుకు జనసేన సైనికులు, పవన్ అభిమానులు పెద్ద ఎత్తున కాటన్ బ్యారేజి వద్దకు
చేరుకున్నారు. పిచుకుల లంక నుండి కాటన్ విగ్రహం వరకు అంటే సుమారు రెండున్నర
కిలోమీటర్ల కవాతుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి.
జిల్లాలోని నేతలందరూ ఇప్పటికే బ్యారేజి వద్దకు చేరుకున్నారు. మరి కాసేపట్లో పవన్ కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. ఈ సమయంలో బ్యారేజి భద్రత పేరుతో రాజమండ్రి పోలీసులు కవాతును అడ్డుకోవటం ఏంటో అర్ధం కావటం లేదు. కవాతుకు ధవళేశ్వరం బ్యారేజి ఎంత మాత్రం అనుకూలం కాదన్నారు. బ్యారేజి పిట్ట గోడలు బలహీనగా ఉన్నాయని కాబట్టి 10 వేల మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు పోలీసులు నోటసులో స్పష్టం చేశారు. అయితే, కవాతును భారీ ఎత్తున నిర్వహించే ఉద్దేశ్యంతో లక్షలాది మంది జనసైనికులు, అభిమానులు పాల్గొనాలంటూ పవన్ స్వయంగా పిలిపిచ్చిన విషయం తెలిసిందే.
అందుకనే కవాతులో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుండి రాజమండ్రికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. కవాతునే కాకుండా సభా ప్రాంగణాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకంటే, కవాతు తర్వాత బహిరంగ సభను కూడా బ్యారేజి క్రిందనే ఉండే స్థలంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అన్నీ ఏర్పాట్లను జనసేన ముందే అధికారులకు చెప్పింది. కవాతు, బహిరంగ సభ లాంటి అన్నింటికి పర్మిఫన్లు కూడా తీసుకుంది. మొదట్లో అన్నింటికీ అనుమతులిచ్చిన అధికారులు చివరి నిముషంలో రద్దు చేయమంటే ఆశ్చర్యంగా ఉంది. అనుమతుల రద్దులో జనసేన నేతుల రాజకీయ కోణం కూడా చూస్తున్నారు.