వినటానికి ఆశ్చర్యంగానే ఉన్నా జిల్లాలో జరుగుతున్న ప్రచారం చూస్తుంటే నమ్మక తప్పేట్లు లేదు.  ఇంతకీ విషయం ఏమిటంటే జిల్లా తెలుగుదేశంపార్టీలో కీలకంగా ఉన్న చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ జనసేన వైపు చూస్తున్నారట. పోయిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన ఆమంచి తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి పోతుల సునీతపై సుమారు 10 వేల ఓట్లతో గెలిచారు. అంతకుముందు అంటే 2009లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచిన ఆమంచిని చంద్రబాబునాయుడు టిడిపిలోకి లాగేసుకున్నారు. వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలనే ప్రలోభాలకు గురిచేసి టిడిపిలోకి లాక్కున్న చంద్రబాబుకు ఇండిపెండెంట్ ఎంఎల్ఏని లాక్కోవటం ఓ లెక్కా ?

 

స్వతంత్ర ఎంఎల్ఏగానే చంద్రబాబుతో యాక్సిస్ మెయిన్ టైన్  చేసేవారు. అలాంటిది టిడిపిలోకి లాక్కున్న తర్వాత ప్రాధాన్యత ఇవ్వకుండా ఎలా ఉంటారు ? ఆమంచి ఎప్పుడైతే టిడిపి అనుబంధ సభ్యుడయ్యారో అప్పటి నుండి జిల్లాలో హవా బాగానే సాగిస్తున్నారు. సిఎంతో పాటు చినబాబు లోకేష్ తో కూడా టచ్ లో ఉంటూ  చీరాలలో అభివృద్ధి కార్యక్రమాల పేరుతో నిధులు పెద్ద ఎత్తున మంజూరు చేయించుకున్నారు. సరే నిధుల దుర్వినియోగం గురిచి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు లేండి. ఎలాగూ ఎంఎల్ఏ కుటుంబంపై అక్రమ క్వారీయింగ్ ఆరోపణలు ఉండనే ఉన్నాయి. విజిలెన్స్ వాళ్ళు ఆకస్మిక దాడులు జరిపి క్వారీయింగ్ ను నిలిపేసిన సంగతి అందరికీ తెలిసిందే.

 

ఆమంచికి చంద్రబాబు అంత ప్రాధాన్యత ఇస్తున్నా ఎంఎల్ఏ చూపు ఇపుడు జనసేన వైపు చూస్తోందని బాగా ప్రచారం జరుగుతోంది. ఎందుకంత ప్రచారం జరుగుతోందంటే అందుకు కారణం ఉందట. వచ్చే ఎన్నికల్లో టిడిపి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని అర్ధమైపోతోంది. టిడిపి అధికారంలోకి రాకపోతే మరే పార్టీ అధికారంలోకి వస్తుంది అంచన ? వైసిపికి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేంత బలం రాదని అంచనా వేస్తున్నారట. అటు టిడిపి ఓడిపోయి, ఇటు వైసిపికి పూర్తి బలం రాకపోతే మరి అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది ? ఏ పార్టీ వస్తుందంటే  హంగ్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారట.

 

నిజంగానే హంగ్ వస్తే అప్పుడు జనసేన పార్టీనే ప్రభుత్వ ఏర్పాటులో కీలకమవుతుందని అంచనా వేస్తున్నారట. ఈ విషయన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పటి నుండో చెబుతున్న విషయం గమనార్హం. సో, ఆమంచి ఆలోచన కూడా ఆ దిశగానే ఉందని అర్ధమవుతోంది. అందుకనే ఆమంచి చూపు జనసేన వైపు చూస్తోందట.  సామాజికవర్గపరంగా ఎలాగూ పవన్ తో ఆమంచికి మంచి సంబంధాలే ఉన్నాయట. కాబట్టి జనసేనలో టిక్కెట్టు వరకూ ఇబ్బంది లేదట. అందుకనే ముందుజాగ్రత్తగా జనసేన వైపు చూస్తున్నట్లు ప్రచారం బాగా జరుగుతోంది.

 

అయితే ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకూ హంగ్ ఏర్పడలేదు. ఇస్తే ఏదో ఒకపార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చేయటమే. చాలా ఎన్నికల్లో అటు శ్రీకాకుళంతో మొదలుపెడితే ఇటు చిత్తూరు జిల్లా వరకూ ఒకే పార్టీకి అనుకూలంగా రిజల్ట్ వచ్చిన ఎన్నికలు చాలానే ఉన్నాయి. అయితే, ఏపిలో ఇప్పటి వరకూ ఎక్కువ పార్టీలు పోటీ పడిన సందర్భాలు కూడా లేవనే చెప్పాలి. 1982 తర్వాత తెలుగుదేశంపార్టీ, కాంగ్రెస్ పార్టీలే ప్రధాన పోటీదారులు. రేపటి ఎన్నికలు హోరాహోరీగా జరిగుతుందని కాబట్టి హంగ్ తప్పదని పవన్ అంచనా వేస్తున్నట్లు కనబడుతోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో ?


మరింత సమాచారం తెలుసుకోండి: