ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్ఠానం పెద్ద షాకే ఇచ్చింది.  రేవంత్ మద్దుతుదారుల్లో సగంమందికి పైగా టిక్కెట్ల విషయంలో అధిష్ఠానం మొండి చెయ్యి చూపింది. తెలుగుదేశంపార్టీలో తిరుగులేని నేతగా ఉన్న రేవంత్ రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ లో చేరేటపుడు రేవంత్ తానొక్కడే కాకుండా భారీ సంఖ్యలో మద్దతుదారులతో చేరారు. తన మద్దతుదారులతో రేవంత్  చేరిన తర్వాతే కాంగ్రెస్ పార్టీకి బాగా ఊపొచ్చిన విషయం వాస్తవం. అప్పటి నుండే కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ ప్రత్యేకించి కెసియార్ కుటుంబం బాగా ఇబ్బందులు పడుతున్నారు.

 

సరే,  కాంగ్రెస్ పార్టీలో చేరేటపుడు తనతో పాటు మద్దతుదారులకు టిక్కెట్ల హామీని తీసుకునే రేవంత్ కాంగ్రెస్ లో చేరారు. అయితే, అప్పటికి ఇప్పటికి రాజకీయాల్లో చాలా మార్పులొచ్చాయి.  ముందస్తు ఎన్నికలు వచ్చే సమయానికి కెసియార్ తో విభేదించి పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరారు. అంటే ముందుగా వచ్చిన రేవంత్ అండ్ టీమ్ తో పాటు తాజాగా పార్టీలో చేరిన కిసియార్ వ్యతరేకులకు కూడా టిక్కెట్లు సర్దుబాటు చేయాల్సొచ్చింది. సమస్యంతా ఇక్కడే మొదలైంది. ఉన్నదేమో 119 నియోజకవర్గాలు. ఆశావహులేమో ప్రతీ నియోజకవర్గంలో  10 మిందికి పైగా ఉన్నారు. రేవంత్ వర్గం, కెసియార్ వ్యతిరేకులు కాంగ్రెస్ నేతలకు అదనంగా వచ్చారు. ఇదికాకుండా మహాకూటమి పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లు వదులుకోవాల్సి వచ్చింది.

 

ఇటువంటి పరిస్ధితుల్లోనే కాంగ్రెస్ సీనియర్ నేతలకు, రేవంత్ వర్గంలో కొందరికి అధిష్ఠానం టిక్కెట్లు ఇవ్వలేని పరిస్ధితిలో పడింది. దాంతో ముందు హామీలిచ్చినా తప్పని పరిస్ధితుల్లో కొందరికి టిక్కెట్లలో కోత వేసేసింది. అందులో భాగంగానే రేవంత్ వర్గంలోని నలుగురికి టిక్కెట్లు దక్కలేదు. ఎల్లారెడ్డి నుండి టిక్కెట్టు ఆశించిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, మేడ్చల్ లో జంగయ్య యాదవ్, పాలేరులో పోట్ల నాగేశ్వరరావుకు టిక్కెట్లు దక్కలేదు. దాంతో రేవంత్ వర్గం షాక్ గురైనట్లే. రేవంత్ మొత్తం ఎనిమిది మందికి టిక్కెట్ల హామీని పొందరు. మొదట్లో అయితే రేవంత్ కు తప్ప ఇంకెవరికీ టిక్కెట్లు ఇవ్వలేమని చేతులెత్తేసింది నాయకత్వం. కానీ రేవంత్ పట్టుబట్టిన తర్వాత నలుగురికి మాత్రమే టిక్కెట్లు కేటాయించింది. మొత్తానికి అధిష్ఠానం రేవంత్ కు షాక్ ఇచ్చిందనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: