దేశంలో రాజకీయాలనే శ్వాసగా భావించే నాయకుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందు వరుసలో ఉంటారు. దేశంలో తానే సీనియర్ నాయకుడినని కూడా ఆయన తరచూ చెబుతుంటారు. వాస్తవానికి చంద్రబాబుకు రాజకీయాలకు మించిన వ్యాపకాలు కూడా లేవు. ఎత్తులు, పైఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాల్లో ఆయన దిట్ట అన్న సంగతి అనేకసార్లు చరిత్ర రుజువు చేసింది కూడా.
ఐతే.. ఆయన్ను రాజకీయ అవకాశవాదిగా విమర్శించే వారి సంఖ్య తక్కువేమీ కాదు. తన రాజకీయ అవసరాల కోసం ఆయన దేనికైనా సిద్ధపడిపోతారని వారు విమర్శిస్తుంటారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలు చూస్తే అది వాస్తవమేనేమే అనిపించకమానదు. బావమరిది నందమూరి హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకుని కూడా చంద్రబాబు రాజకీయం చేశారని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు.
టీడీపీ ప్రజాకూటమి కట్టక ముందు.. చంద్రబాబు కేసీఆర్ తో స్నేహం కోసం ప్రతిపాదించారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పొత్తు పెట్టుకుందామని ప్రయత్నించారు. ఈ విషయం స్వయంగా ఆయనే మీడియాకు.. అనేక బహిరంగ సభల్లోనూ పలుసార్లు వివరించారు. అయితే నందమూరి హరికృష్ణ హఠాత్తుగా చనిపోయిన సమయంలోనూ చంద్రబాబు కేటీఆర్ వద్ద పొత్తు ప్రస్తావన తెచ్చారట.
నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పరిణితితో వ్యవహరించింది. హరికృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించింది. స్వయంగా కేసీఆర్, కేటీఆర్ హరికృష్ణ ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు.
కేటీఆర్ హరికృష్ణకు నివాళులు అర్పించేందుకు వెళ్లిన సమయంలో అక్కడ చంద్రబాబు ఉన్నారట. కేటీఆర్ తో మాట్లాడారట. ఆ సమయంలో కూడా చంద్రబాబు,. ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటామని అడిగారట. బావమరిది శవాన్ని పక్కన పెట్టుకుని కూడా చంద్రబాబు రాజకీయం మాట్లాడారంటూ తాజాగా కేటీఆర్ ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు.