అగ్రవర్ణాల్లో పేదల కోసం మోడీ సర్కారు రూపొందించిన 10 శాతం రిజర్వేషన్ల బిల్లు చట్టరూపం దాల్చింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర తర్వాత అది గెజిట్ రూపంలో ప్రచురితమైంది. అంటే ఇక దేశవ్యాప్తంగా అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చేసినట్టే.
మొట్టమొదటగా గుజరాత్ సర్కారు వీటిని అమలు చేస్తుండగా.. ఆ తర్వాత స్థానంలో కేసీఆర్ సర్కారు ఉంది. సాధ్యమైనంత త్వరగా ఈ రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చేందుకు కేసీఆర్ సర్కారు కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఎంపీ ఎన్నికల్లో ఇది తమకు ఓట్లు తెస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు.
కేంద్రం 10శాతం రిజర్వేషన్లు చట్టం తీసుకొచ్చినా దాన్ని రాష్ట్రాలు యథాతథంగా అమలు చేయాల్సిన అవసరం లేదు. తమ రాష్ట్రాలకు అనుగుణంగా నిబంధనలు మార్చుకోవచ్చు. దీని ప్రకారం కేసీఆర్ సర్కారు 8 లక్షల ఆర్థిక పరిమితిని తగ్గించే ఆలోచన చేస్తున్నట్టు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం వెలువరించింది.
అంతే కాదు.. ఈ పది శాతం రిజర్వేషన్లు.. కుల, మత ప్రాతిపదికన లేనందువల్ల వీటిలో పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు కూడా వస్తాయని తెలంగాణకు చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పినట్టు ఆ ఆంగ్లపత్రిక రాసింది. దీన్నిబట్టి ఇవి అగ్రవర్ణ పేదలకు మాత్రమే కాకుండా పేదలందరికీ వర్తిస్తాయన్నమాట. చూడాలి ఇది ఎంతవరకూ వాస్తవ రూపం దాలుస్తుందో.