ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రభావ శీల మహిళగా, బాంకర్ గా ఘన కీర్తి, గౌరవాన్ని పొందిన ఐసీఐసీఐ బ్యాంకు మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) చందా కొచ్చర్, ప్రవర్తనా నియమావళి ని తీవ్రంగా ఉల్లంఘించారని ఐసీఐసీఐ బ్యాంక్ తన స్వతంత్ర దర్యాప్తు అనంతరం నిర్థారించింది. "ఆమె చేసిన తప్పు పూర్తిగా వెల్లడైందని, విశ్వసనీయ కర్తవ్యాలకు సంబంధించిన నియమావళిని ఆమె సంపూర్ణంగా ఉల్లంఘించినట్లు తమ దర్యాప్తులో నిర్థారణ అయింది” అని ఐసీఐసీఐ బ్యాంకు పేర్కొంది. ఆమె రాజీనామాను టెర్మినేషన్ ఫర్ కాజ్ గా (ఈ కారణంగానే ఆమె ఉద్యోగం నుండి తొలగించినట్లు ) పరిగణిస్తామని, ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది.
అయితే ఇప్పుడు చందా కొచ్చర్ పై సీబీఐ ఛార్జిషీటు నమోదు చేయడం బ్యాంకర్లలో వణకు మొదలైంది. న్యాయస్థానం పరిధిలో ఉన్న కేసుపై ఏం మాట్లాడలేక పోయినా, ఈ పరిణామంతో ఋణాలను మంజూరు చేసే విషయమై నిర్ణయాలు తీసుకునేటపుడు ముఖ్యంగా ఉన్నతాధికారుల ఇన్వాల్వ్మెంట్ విషయంలో ఆచి తూచి వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తోంది అని బాంకర్స్ వాపోతున్నారు.
చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ అధిపతి వేణుగోపాల్ దూత్ పేర్లు ప్రధానంగా అభియోగపత్రంలో (ఛార్జిషీటు) వచ్చిన సంగతి తెలిసిందే. వీరితోనే వదిలి పెట్ట లేదు. బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ లేదా కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ లో ఉన్న:
*ఈ బ్యాంకు మాజీ సిఈఓ---కేవీ కామత్,
*ప్రస్తుత ఎండీ, సీఈఓ---సందీప్ భక్షి,
*గోల్డ్ మాన్ శాక్స్ ఇండియా ఛైర్మన్--- సంజయ్ ఛటర్జీ,
*స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇండియా సీఈఓ--- జరీన్ దారువాలా,
*ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ ---ఎన్.ఎస్. కన్నన్,
*టాటా క్యాపిటల్ ఎండీ ---రాజీవ్ సబర్వాల్,
*బ్యాంక్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్--- కె. రామ్‌కుమార్,
*మాజీ బోర్డు సభ్యుడు---హెచ్. ఖుస్రోఖాన్ -----------తదితరుల పేర్లు కూడా ఛార్జిషీటులో చోటు చేసుకున్నాయి.
అసలు కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ ను ఈ కేసులోకి ఎందుకు లాగారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. వేణుగోపాల్ దూత్ కంపెనీలో చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ వ్యాపార లావాదేవీలకు ప్రతిగా చందా కొచ్చర్ — వేణుగోపాల్ దూత్ (వీడియోకాన్ లిమిటెడ్) కు ఋణాలిచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో తొలుత వీరిచుట్టూ కేసు తిరిగిన విషయం తెలిసిందే.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ నిర్వహించిన దర్యాప్తులో వీడియోకాన్ లిమిటెడ్ కు ఐసీఐసీఐ బ్యాంకు ఋణాల మంజూరులో అక్రమాలు జరిగినట్లు నిర్థారణ అయింది. చందా కొచ్చర్ ఐసీఐసీఐ బ్యాంకు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంది. దీంతో ఆమె రాజీనామాను పదవి నుంచి తొలగించిననట్లు లేదా టెర్మినేషన్ గా బ్యాంకు పరిగణించి నట్లుగా ప్రకతించింది.
ప్రస్తుతం, భవిష్యత్తులో ఆమెకు చెల్లించవలసిన పేమెంట్ లను ఐసీఐసీఐ బ్యాంకు రద్దు చేసింది. అంతేకాకుండా 2009 ఏప్రిల్ నుంచి 2018 మార్చి వరకు ఇచ్చిన బోనస్ ను కూడా తిరిగి రాబట్టేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది.
ఐసీఐసీఐ బ్యాంక్ ఉదంతమే కాదు గతంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర విషయంలోనూ జరిగిన పరిణామాల నేపథ్యంలో, బ్యాంకర్లు ఆచీతూచీ వ్యవహరించాల్సి వస్తోంది. డీఎస్కే ఋణ సంబంధ కేసు విషయంలో ఆ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉన్నతాధికారులైన ఆర్.పి. మరాఠే, సుశీల్ మునాత్, ఆర్.కె. గుప్తా లు అరెస్టయినప్పుడు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ వారికి మద్దతుగా నిలిచింది. కేసు కూడా వేసింది. అయితే కేసు సాగే కొద్దీ, బ్యాంకు నియమ నిబంధనలు, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు తేలటంతో కేసును ఉపసంహరించుకున్నాయి.
చందాకొచ్చర్ విషయంలోనూ తొలుత ఐసీఐసీఐ బ్యాంకు, బోర్డు ఆమెకు మద్దతుగా నిలిచి, ఆ తర్వాత క్రమంగా వెనక్కి తగ్గింది. తొలుత సెలవులోకి వెళ్లినా, ఏమీ పట్టించుకోని ఐసీఐసీఐ బోర్డు, ఆ తర్వాత చందా కొచ్చర్ ను తొలగించాల్సి వచ్చింది కూడా. బ్యాంకులు తీసుకునే నిర్ణయాల్లో అవకతవకలు చోటు చేసుకుంటే, పలు దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగడం తమ ప్రతిష్ఠకు కూడా భంగమేనని ఆర్బీఐ కూడా ఆందోళన చెందుతోంది.
మొండి బకాయిలతో సతమతమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న తరుణంలో, ఇలాంటి కేసులు బ్యాంకింగ్ వ్యవస్థను తిరిగి అగాధంలోకి నెడతాయేమోనన్న భయం ప్రభుత్వం లోనూ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించక తప్పదు. కానీ ఆ కొంత మంది చేసే తప్పుల వల్ల మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ పైనే విశ్వాసం సన్నగిల్లి ధారుణ ప్రభావం పడుతుండడమే మింగుడుపడని విషయమని ఆర్థిక వేత్తలు అభిప్రాయ పడుతున్నారు.