భారతదేశ రాజకీయాలలో రాజకీయ వారసత్వాలకు అంతే లేదు. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ వారసుల సంఖ్య అనంతం. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా నాయకు లంతా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తమ వారసులను రంగంలోకి దింపుతున్నారు. తాజాగా ఏపీ రాజకీయాల్లో మరో రాజకీయ వారసుడి రాజకీయ రంగప్రవేశం నిశ్చయమైంది.
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో మరో రాజకీయ నాయకుడి రంగప్రవేశం నిశ్చయమైంది. గత ఏడాది విదేశాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ, గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, మతుకుమిళ్ళ వీర వెంకట సత్యనారాయణ మూర్తి (ఎంవివిఎస్ఎన్ మూర్తి) మనవడు శ్రీ భరత్ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు.
ఈ మేరకు ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. తాతయ్య ఆశయాలను నిజం చేసేందుకు ప్రజాసేవ లోకి అడుగు పెట్టాలనుకుంటున్నట్టు చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆదేశిస్తే ఏదైనా పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తానని చెప్పారు.
శ్రీభరత్ కేవలం ఎంవీవీఎస్ మూర్తికి మనవడు మాత్రమే కాదు. సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు స్వయానా అల్లుడు. బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్వినిని శ్రీభరత్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో శ్రీభరత్ అటు నందమూరి కుటుంబానికి కూడా దగ్గరివాడే కావడం విశేషం. అటు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కుమార్తెకు శ్రీభరత్ కుమారుడు కావడం మరో విశేషం. ఇలా పొలిటికల్‌గా మంచి నేపధ్యం ఉన్న శ్రీభరత్, తాజాగా, తన రాజకీయ రంగ ప్రవేశం పైనా ఆయన స్పష్టం చేసేశారు.
ఇప్పటికే నందమూరి బాలకృష్ణ పెద్ద అల్లుడు, నారా లోకేశ్, ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య రెండో అల్లు, శ్రీభరత్ కూడా రాజకీయాల్లో వచ్చేస్తుండడం విశేషం. అయితే, లోకేశ్ ప్రత్యేక్ష ఎన్నికల్లో కాకుండా, ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యి, మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
అయితే, శ్రీభరత్ మాత్రం ఎంపీగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన వరుసకు పెదనాన్న, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలవర్షం కురి పించారు. ఏపీ రాజధాని నిర్మాణం, పోలవరం వంటి ప్రాజెక్టులు పూర్తి చేయగల సమర్థ నాయకుడు, చంద్రబాబు మాత్రమేనని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. మరి శ్రీభరత్ ఏ మేరకు విజయం సాధిస్తారో చూడాలి.