ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేయడంతో వైసిపి వర్గాల్లో ఎక్కడా లేని జోష్ నెలకొంది. ఏపీ కొత్త సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అంచనాల్లో విహరిస్తున్న వైసీపీ నేతల మధ్య ఇప్పుడు కొత్త చర్చ ప్రారంభమైంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం దాదాపు ఖాయం కావడంతో తమ ప్రభుత్వంలో కీలకమైన శాఖలు ఎవరెవరికి ఉన్నాయనే విషయంలో వైసీపీలో కీలక నేతలు, సీనియర్ నేతలు ఎవరికి వారే తమకు ఏ పదవి వస్తుందని అంచనాలు వేసుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలోనే జగన్ కేబినెట్‌లో అత్యంత కీలకమైన ఆర్థిక శాఖ మంత్రి పదవి ఎవరికి ? దక్కుతుంది అనే అంశంపై వైసీపీలోనే రెండు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న జగన్ కేబినెట్ లో కొత్త ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్న పేరు ఉంది.
ఈ లిస్టులో ఆనం పేరుతో పాటు డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేరు కూడా కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో వైసీపీ వర్గాల పేరుతో హల్‌చల్ చేసింది. గతంలో దివంగత వైఎస్ కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా పనిచేసిన ఆనంకు ఆర్థిక రంగంలో అపారమైన అనుభవం ఉంది. అయితే ఫలితాలు మరో రెండు రోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో జగన్ కేబినెట్‌లో ఆర్థిక మంత్రికి మరో కొత్త పేరు అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. వైసీపీ తరపున ఢిల్లీలో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్న ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఆర్థిక శాఖ దక్కుతుందని వైసీపీలోని ఓ వర్గం చెబుతోంది. విజయసాయిరెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఆయనకు ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు.
గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ఎన్నికల్లో పోటీ చేసిన యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ కోటాలో ఆర్థికమంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. అటు ఆనం రామనారాయణ రెడ్డితో పాటు విజయ్ సాయి రెడ్డి ఇద్దరు ఆర్థికరంగంలో నిష్ణాతులు అయినా ఆనంకు పదేళ్లపాటు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అయితే ఆనం పలు పార్టీలు మారి ఎన్నికలకు ముందు వైసీపీలోకి వచ్చారు. విజయసాయి ఆరంభం నుంచి జగన్ దగ్గర ఉన్నారు. మరి జగన్ వీరిద్దరిలో ఎవరిని ఆర్థికమంత్రిగా ఎంపిక చేసుకుంటారు చూడాలి. అలాగే డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి వాళ్ళ పేర్లు సైతం ఆర్థిక మంత్రి రేసులో వినిపించినా ఆయనకు మరో కీలక శాఖ లభించవచ్చన్న ప్రచారం జరుగుతోంది. అలాగే కీలకమైన స్పీకర్ పదవి కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, అంబటి రాంబాబు పేర్లు లైన్‌లో ఉన్నాయి.