కోడెల శివ‌ప్ర‌సాద‌రావు. ఏపీ తొలి అసెంబ్లీ స్పీక‌ర్‌గా రికార్డు సృష్టించారు. అపార‌మైన రాజ‌కీయ అనుభ‌వం ఉన్న టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు. గుంటూరు జిల్లాలో చ‌క్రం తిప్పిన ఆయ‌న త‌న కుటుంబాన్ని మాత్రం అవినీతి, అక్ర‌మాలు, దోపిడీ నుంచి మాత్రం ర‌క్షించుకోలేక పోయార‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి. స్పీక‌ర్‌గా ఉన్న తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆయ‌న కుమార్తె పూనాటి విజ‌య‌ల‌క్ష్మి, కుమారుడు కోడెల శివ‌రామ‌కృష్ణ‌లు గుంటూరుజిల్లాలో అడ్డంగా దోచుకున్నారు. ముఖ్యంగా కాంట్రాక్ట‌ర్ల‌ను సైతం బెదిరించి సొమ్ము చేసుకున్నారు. 


అందిన కాడికి అందిన‌ట్టు అన్ని విష‌యాల్లోనూ త‌మ వాటాల‌ను అందుకున్నారు. ఇక‌, కుమార్తె మ‌రో అడుగు ముందు కేసి.. భూముల విష‌యంలో జోక్యం చేసుకుని, త‌న‌కు సంబంధం లేక‌పోయినా..కూడా మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాన్ని బెదిరించి మ‌రీ దోపిడీ బాట ప‌ట్టారు. కోట్లాది రూపాయ‌ల‌ను ఆయా వ్య‌క్తుల‌ను బెదిరించి మ‌రీ సొంతం చేసుకున్నారు. గ‌తంలో టీడీపీ ప్ర‌భుత్వం ఉండ‌డం, తండ్రిస్పీక‌ర్‌గా ఉండ‌డంతో బాధితులు నోరు విప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఇక‌, ఇప్పుడు ప్ర‌భుత్వం మార‌డం, అవినీతి అంతు చూస్తాన‌ని యువ సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌డంతో కోడెల కుటుంబ బాధితులు ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. 


ఈ క్ర‌మంలోనే అటు శివ‌రామ‌కృష్ణ‌పైనా, ఇటు విజ‌య‌ల‌క్ష్మిపైనా కూడా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ ప‌రిణామాలు త‌న మెడ‌కు ఎక్క‌డ చుట్టుకుంటాయోన‌ని భ‌య‌ప‌డుతున్న కోడెల తాజాగా మీడియా ముందుకు వ‌చ్చి మొస‌లి క‌న్నీరు కారుస్తున్నారు. త‌న కుటుంబ స‌భ్యుల‌కు అవినీతి అంటే ఏంటో కూడా తెలియ‌ద‌ని ధ‌ర్మ‌ప‌న్నాలు వ‌ల్లిస్తున్నారు. తాను క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పెంచాన‌ని, వారికి అక్ర‌మాలు అంట‌గ‌ట్ట‌డం అన్యాయ‌మ‌ని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వ‌కంగానే త‌న కుటుంబాన్ని టార్గెట్ చేసింద‌ని కుయ్యో.. మొర్రో అంటున్నారు. అయితే, కోడెల నిజ స్వ‌రూపం తెలిసిన వారు మాత్రం ఇంకా నాట‌కాలెందుకు మాజీ స్పీక‌ర్ అంటూ ఆట‌ప‌ట్టిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: