ఆయనో ప్రముఖ హీరో.. విప్లవ నాయకుడిగా.. ఆవేశపరుడైన కథానాయకుడిగా మెప్పించాడు.. ఎక్కువగా పోలీసు అధికారి పాత్రల్లో రాణించాడు. ఆ తర్వాత రాజకీయాల్లోనూ హీరో కావాలనుకున్నారు. సొంత పార్టీ పెట్టారు. కానీ ఆశించినంత సక్సస్ రాలేదు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్టున్నారు. 

రాజకీయాలంటే మాటలు కాదు.. కోట్లు ఖర్చు చేయాలి.. పాపం అందుకోసమో ఏమో.. ఓ బ్యాంకు దగ్గర భారీగానే అప్పు తీసుకున్నారు. సకాలంలో కట్టలేదు.. నోటీసులకు స్పందించలేదు.. అందుకే ఆ బ్యాంకు ఆ ప్రముఖ నటుడి ఇల్లు, ఆయనకు చెందిన ఇంజినీరింగ్ కాలేజీనీ వేలం వేస్తున్నట్టు పత్రికల్లో ప్రకటన ఇచ్చింది. 

ఇంతకీ ఆ నటుడు ఎవరో చెప్పలేదు కదూ.. ఆయనే ప్రముఖ తమిళ స్టార్ విజయకాంత్.. ఆయన్ను తమిళులు ముద్దుగా నల్ల రజనీకాంత్ అని కూడా పిలుచుకుంటారు. డీఎండీకే పేరుతో పార్టీ పెట్టిన ఆయన అంతగా సక్సస్ కాలేకపోయారు. ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్... విజయకాంత్‌ చెల్లించాల్సిన బాకీ మొత్తం రూ.5.50 కోట్లకు చేరింది. 

అప్పు బకాయిని రాబట్టుకునేందుకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు.. ఆయన ఇళ్లు, ఇంజినీరింగ్‌ కాలేజీని వేలం వేయనున్నట్లు ప్రకటించింది. చెన్నై సాలిగ్రామంలోని ఇంటిని,  మామండూరులోని ఇంజినీరింగ్‌ కాలేజీనీ వేలానికి పెట్టింది. ఐతే.. ఈ వేలం ప్రకటనపై విజయకాంత్ మాత్రం ఇంకా స్పందించలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: