ఏపీలో వైసీపీ సునామీలో ఎంతోమంది జూనియర్‌లు తొలిప్రయత్నంలోనే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వైసీపీ నుంచి ఈ ఎన్నికల్లో ఏకంగా 70 మంది తొలిసారి చట్టసభలకు ఎంపికయ్యారు. నందిగం సురేష్ లాంటి సామాన్యులను సైతం ఎంపీలుగా చేసిన ఘనత జగన్‌కే దక్కుతుంది. ఎన్నికల్లో పోటీ చేసి ఎలాంటి రాజకీయ అనుభవం లేని వారు సైతం టిడిపి మంత్రులను, సీనియర్లను మట్టికరిపించారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి పోటీ చేసిన వెంకట రోశయ్య టిడిపి దిగ్గజం దూళిపాళ్ల నరేంద్రను ఓడించి జెయింట్ కిల్లర్ గా నిలిచారు.
1994 ఎన్నికల నుంచి ఓటమి అనేది లేకుండా వరుస విజయాలు సాధిస్తూ వస్తున్న నరేంద్రను ఓడించేందుకు గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు.. ఎన్నో ప్రయత్నాలు చేశారు. వారి వల్ల సాధ్యం కానిది ఈ ఎన్నికల్లో కిలారు వెంకట రోశయ్యకు సాధ్యమైంది. విచిత్రం ఏంటంటే ఎన్నికలకు ముందు వరకు పొన్నూరు వైసిపి ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక జగన్ కిలారు వెంకట రోశయ్యకు పొన్నూరు పగ్గాలు అప్పగించారు.
అప్పటి వరకు గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా ఉన్న ఆయనను తప్పించి పొన్నూరుకు పంపారు. ఎన్నికలకు కేవలం 23 రోజుల ముందు మాత్రమే పొన్నూరులో అడుగుపెట్టిన రోశయ్య నరేంద్ర పై 1200 ఓట్ల తేడాతో విజయం సాధించి సంచలనం సృష్టించారు. వరుసగా ఐదు విజయాలు సాధిస్తూ వచ్చిన నరేంద్ర ఎన్నికల్లో కూడా గెలిచి డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నించారు. అయితే నరేంద్ర డబుల్ హాట్రిక్‌కు రోశయ్య చెక్ పెట్టేశారు. తన విజయం పై రోశయ్య మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి తనను పిలిచి బీఫామ్ ఇచ్చి పోటీ చేయాలని ఆదేశించారని... ఆయన దయతో కేవలం 23 రోజుల్లోనే తను ఎమ్మెల్యే అయ్యాను అని చెప్పారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి రహిత, సమర్థవంతమైన, నీతివంతమైన పాలనను అందించేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తున్నారని, ఆయన అడుగుజాడల్లోనే మనమందరం నడవాలని నియోజకవర్గ ప్రజలకు సూచించారు. గతంలో ప్రజారాజ్యం నుంచి తెనాలి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన రోశయ్యకు ఆ తర్వాత రాజకీయంగా అదృష్టం కలిసి రాలేదు. వైసీపీలో చేరిన గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఉంటే ఆయన గెలుపుపై సందేహం ఉండేది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా గల్లా జయదేవ్ మరోసారి విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరిలో అనూహ్యంగా పొన్నూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రోశయ్య నరేందర్ ని ఓడించి సంచలన విజయం సాధించడంతో పాటు తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.