
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ చైతన్యం ఎవరికీ అంతుపట్టదు. ఆయన ఎప్పుడు ఎవరికి ఎలా ? షాక్ ఇస్తారో ఎవ్వరు ఊహించలేరు. అందుకే ఆయన్ను అందరూ అపర రాజకీయ చాణుక్యుడు అని పిలుస్తుంటారు. కేసీఆర్‌ను నమ్ముకున్న విపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కారెక్కేశారు. పార్టీలో చేరేముందు కేసీఆర్ వాళ్లకు ఎన్నో హామీలు ఇచ్చారు. అయితే ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు వాళ్లకు షాక్ ఇవ్వడంతో ఇప్పుడు కేసీఆర్ జంపింగ్‌లకు షాక్ ఇస్తున్నారట.
తెలంగాణలో కాంగ్రెస్ ను వీడి టీఆర్ ఎస్ లో చేరి గంపెడాశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు నెత్తినోరు కొట్టుకుంటూ కక్కలేక మింగలేక కుమిలిపోతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి - గండ్ర వెంకటరమణా రెడ్డి - పైలట్ రోహిత్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే 12 మంది ఎమ్మెల్యేలు కారు ఎక్కేశారు. వీరిలో కొందరికి మంత్రి పదవులు... నామినేటెడ్, విప్, కార్పొరేషన్ పదవులపై కేసీఆర్ నుంచి హామీలు వచ్చాయి.
ఇక సబితకు మహిళా కోటాలో మంత్రి పదవి ఇస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. ఆమె కుమారుడికి టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వలేదన్న గుసగుసలు పార్టీలోనే ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్లారెడ్డికి మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు సబితను పట్టించుకోవడం లేదట. మరో ట్విస్ట్ ఏంటంటే మల్లారెడ్డి తాజా ఎన్నికల్లో మల్లారెడ్డి అల్లుడికి మల్కాజ్గిరి ఎంపీ సీటు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక ఎస్టీ కోటాలో కేసీఆర్ మంత్రివర్గంలో ఎవరూ లేరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచి కారెక్కిన ఆత్రం సక్కు - రేగా కాంతారావు - వీరయ్యలు ఇప్పుడు మంత్రి పదవిపై ఆశలు పెంచుకున్నారు. పాలేరులో తుమ్మలపై గెలిచిన కందాళ ఉపేందర్‌రెడ్డి కార్పొరేషన్ పదవిపై... మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు.
ఇక కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఒక్క గండ్ర వెంకటరమణా రెడ్డి మాత్రమే తన భార్యకు జడ్పీ చైర్ పర్సన్ పదవి దక్కించుకున్నారు. టీఆర్ఎస్ లో చేరి కాసింత లాభపడ్డది ఈయనొక్కరే. ఏదేమైనా జంపింగ్ జపాంగ్‌లకు కేసీఆర్ మార్క్ ఎదురు చూపులు తప్పేలా లేవు. మరి వీళ్ల ఆశలు ఎప్పుడు నెరవేరతాయో ? చూడాలి.