సాధారణంగా ప్రభుత్వ ఖజానా అంటే.. పాడి కుండ. ఏదో ఒక రూపంలో నిత్యం వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జమ అవుతుంటాయి. దీంతో అత్యవసరాల నుంచి నిత్యవసరాల వరకు కూడా ప్రభుత్వం వద్ద నగదు నిల్వలు ఉంటాయి. అయితే, ఏపీలో పరిస్థితి మాత్రం దీనికి చాలా భిన్నంగా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత నుంచి నేటి వరకు అంటే దాదాపు 6 ఏళ్లుగా కూడా ప్రభుత్వ ఖజానా కొల్లబోతున్న పరిస్థితే కనిపిస్తోంది. గత చంద్రబాబు పాలన 16 వేల కోట్లలోటు బడ్జెట్‌తో ప్రారంభమైంది.


అయితే, విభజన హామీల మేరకు కేంద్రం నుంచి రావాల్సిన సాయం ఏదో ఒక రూపంలో అందడం, రాష్ట్రానికి రుణ సదుపాయం ఉండంతో ఆయన ఎలాగోలా నెట్టుకొచ్చారు. అయినప్పటికీ.. అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాత్రం ఖజానా పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎలాంటి మొహమాటం లేకుండా దారుణంగా ఉందని, కనీసం మీ జేబుల్లో ఉన్నపాటి డబ్బులు కూడా ప్రభుత్వ ఖజానాలేవని ఆయన పలు సందర్భాల్లో బహిరంగ వేదికలపైనే చెప్పుకొచ్చారు. 


ప్రభుత్వ ఉద్యోగులకు జీత భత్యాలు ఇచ్చేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని, అప్పులు చేస్తున్నామని చెపుకొచ్చేవారు. ఇక, ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం విషయానికి వచ్చే సరికి ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ప్రభుత్వ ఉద్యోగులకు 27% ఐఆర్‌ ప్రకటించడం, పింఛను దారుల్లో వృద్ధులకు ఒక్కొక్కరికీ 250 చొప్పున పెంచడం, కిడ్నీ రోగులకు ఏకండా 3500ల నుంచి రూ.10 వేలకు పెంచడంతో ఖజానాపై ఎనలేని భారం పడింది. 


దీనికి తోడు కేంద్రం నుంచి వచ్చే సాయం చాలా వరకు తగ్గిపోయంది. గతంలోనే మేం విభజన చట్టం ప్రకా రం ఏపీకి రావాల్సిన సొమ్మును ఇచ్చేశామని కేంద్రం చెబుతుండడం, రుణ పరిమితిని కూడా గత చంద్రబాబు ప్రభుత్వమే దాటిపోయి అప్పులు తెచ్చుకోవడంతో ఇటు కేంద్ర సాయం అందక, అటు రుణాలు కూడా పుట్టని పరిస్థితిని జగన్‌ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. దీంతో నెల నెలా ఠంచనుగా ఇవ్వాల్సిన ఉద్యోగుల జీతాలు, సామాజిక పింఛన్లకు కూడా కటకటలాడాల్సిన పరిస్థితిని ప్రభుత్వం ఎదుర్కొంటోంది. 


తాజాగా ఆగస్టు నెలలో చెల్లించాల్సిన జీతాలు, పింఛన్ల విషయంలో ఒకటో తేదీ లేదా రెండునే ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. మూడో తేదీ వచ్చినా.. కూడా చెల్లించలేని పరిస్థితి ఎదుర్కొంటోంది. మొత్తంగా ఇది పాలకులు చేస్తున్న రాజకీయ విన్యాసం కారణమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా.. హామీలు ఇస్తుండడం, ఆదాయాన్ని తగ్గించుకునే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం శాపంగా మారిందనే వ్యాఖ్యలు వస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: