ఈ దేశంలో ఏదైనా ఆగుతుంది..కానీ వ్యవసాయం ఆగదు అన్నారు మన మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ.. భారతదేశంలో వ్యవసాయం ఎంత ప్రముఖమైందో ఈ ఒక్క వాక్యం చెప్పకనే చెబుతుంది. అలాగే దేశంలో ఉంది ఒకే ఒక కల్చర్.. అదే అగ్రికల్చర్ అని కూడా అనేంతాగ వ్యవసాయం మన జీవన విధానంలో కలసిపోయింది.


మరి అలాంటి రైతు ఎందుకు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండలేకపోతున్నాడు. అప్పులపాలు అవుతున్నాడు.. ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు.. వీరికి కారణాలేంటి.. సమస్యలకు పరిష్కారాలేంటి.. ఈ ప్రశ్నలకు సమాధానం అంత సులభం కాదు. కానీ కొన్ని మార్గాలు అనుసరిస్తే రైతు జీవితం బాగుపడుతుంది. అదేంటో చూద్దాం..


దేశంలో రైతు తప్ప.. ఏ ఇతర ఉత్పత్తిదారు అయినా సరే.. తన ఉత్పత్తికి తానే వెలకడతాడు.. కానీ రైతు సంగతి అలా కాదు. ఈ కనీస మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ రేటుకే రైతు అమ్మాల్సిన పరిస్థితి. డాక్టర్‌ స్వామినాథన్‌ కమిషన్‌ కనీస మద్దతుధర ఉత్పత్తి వ్యయంకన్నా కనీసం 50శాతం అధికంగా ఉండేలా చూడాలని ఎప్పుడో చెప్పింది. కానీ ఆ సిఫారసు బట్టదాఖలైంది.


రైతును చుట్టుముట్టే సమస్యలు ఎన్నో.. కొన్నిసార్లు చాలా తక్కువ ధరలు లభిస్తాయి. కొన్నిసార్లు వర్షాలు సరిగ్గా పడక కరువు కాటకాలు వస్తుంటాయి.. మరికొన్నిసార్లు ప్రకృతి రైతుపై కన్నెర్ర చేస్తుంది. వరదలు, అతివృష్టితో చేతికి అంది వచ్చిన పంట నీటిపాలవుతుంది.. అన్నీ బాగున్నా ఒక్కోసారి పండిన పంటను మార్కెట్లో అమ్ముకునే అవకాశం లభించింది.


ఇలా రైతుకు అడుగడుగునా కష్టాలే స్వాగతం పలుకుతుంటాయి. అందుకే ఇలాంటి సమయాల్లో రైతుల్ని ఆదుకోవడానికి ప్రత్యేకంగా అన్నదాత ఆర్థిక భద్రత నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అదే సమయంలో విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా సాగే దిగుమతులకు కళ్లేలు వేయాలి. ఆహారానికి ఉన్న గిరాకీలో పది శాతాన్ని మించి దిగుమతి చేసుకోకుండా నిబంధన విధించాలి. అంతేకాదు.. రైతు సమస్యలపై పరిశోధనలు పెరగాలి. ఇందుకోసం దేశ బడ్జెట్‌లో కనీసం 10 శాతం వ్యవసాయం పైన ఖర్చు చేయాలి. దేశ జీడీపీ లో కనీసం రెండు శాతం పరిశోధనల మీద ప్రభుత్వం ఖర్చు చేయాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: