ఇపుడిదే అంశంపై పార్టీలో
నేతలు చర్చించుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణాలో పార్టీ బలోపేతంపై,
పార్టీకి పూర్వవైభవం తేవటం కోసం చంద్రబాబునాయుడు దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు.
వారంలో రెండు రోజులు అంటే ప్రతీ శని, ఆదివారాలు తెలంగాణా పార్టీ నేతలకు అందుబాటులో
ఉండటానికి నిర్ణయించుకున్నట్లు స్వయంగా చంద్రబాబే చెప్పారు.
ఇందుకోసం తన డైలీ షెడ్యూల్లో వారంలో చివరి రెండు రోజులు హైదరాబాద్ లో ఉండేట్లు ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే తెలంగాణా నేతలతో ఓసారి భేటి కూడా జరిపారు. అంతా బాగానే ఉంది. మరి తెలంగాణాలో పార్టీ బతికి బట్ట కడుతుందా ? అన్నదే అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న.
రాష్ట్ర విభజనకు చంద్రబాబు మద్దతు ఇచ్చినపుడే తెలంగాణాలో పార్టీ దెబ్బతినటానికి బీజం పడింది. పుట్టుకతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన చంద్రబాబుకు తెలంగాణాలో పట్టు తక్కువే. ఏదో సమైక్యాంధ్రలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి నెట్టుకొచ్చేశారు. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో చంద్రబాబు వేరే దారిలేక సీమాంధ్రకు పరిమితం కావాల్సొచ్చింది. విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినా తర్వత ఓటుకునోటు వ్యవహారంలో తగులుకోవటంతో హైదరాబాద్ ను అర్ధాంతరంగా వదులుకుని విజయవాడకు పారిపోయారు.
అప్పటి నుండి తెలంగాణాలో పార్టీ అనాధగా మారిపోయిందనే చెప్పాలి. అదే సమయంలో కెసియార్ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టిడిపి ఎంఎల్ఏలతో పాటు నేతలను కూడా లాక్కోవటంతో పార్టీ బలహీనమైపోయింది. తర్వాత జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఏవో రెండు సీట్లు దక్కించుకున్నా తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోయారు.
నిజంగా చెప్పాలంటే ఇపుడు పార్టీ తెలంగాణాలో అవసానదశలో ఉన్నట్లే లెక్కే. లీడర్లు లేరు, క్యాడరూ లేదు. ఈ నేపాధ్యంలో తెలంగాణాలో పార్టీని బతికిస్తానని చంద్రబాబు అంటే నమ్మేవారు ఎవరూ లేరు. మరి చంద్రబాబు ప్రయత్నాలు ఎంత వరకూ విజయవంతమవుతుందో చూడాల్సిందే.