కశ్మీర్ పై అంతర్జాతీయ వేదిక మీద మరోసారి పాకిస్తాన్ కు చుక్కెదురైంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో చైనా మినహా మరే దేశం దాయాదికి అండగా నిలవలేదు. సమావేశం తర్వాత కనీసం అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. కశ్మీర్ అంతర్జాతీయ సమస్యన్న పాక్ వాదనను భారత్ ఖండించింది. ఉగ్రవాదానికి ముగింపు పలికితేనే.. పాక్ తో చర్చలుంటాయని తేల్చిచెప్పింది. కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్తాన్ గుండెల్లో గుబులు రేగింది. దీంతో ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశం జరపాలని విజ్ఞప్తి చేసింది. అటు శాశ్వత సభ్య దేశంగా ఉన్న చైనా పాక్ కు మద్దతివ్వడంతో.. భద్రతామండలి రహస్య సమావేశం జరిగింది. అరుదైన సందర్భాల్లో జరిగే క్లోజ్డ్ డోర్స్ మీటింగ్ ఏర్పాటైంది. శాశ్వత సభ్యదేశాలైనా అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, చైనాతో పాటు పది తాత్కాలిక సభ్యదేశాలు కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నాయి. భారత్, పాక్ దేశాలకు భద్రతామండలి సభ్యత్వం ఆ రెండు దేశాల ప్రతినిధులు భేటీలో పాల్గొనలేదు. 

కశ్మీర్లో మానవహక్కుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చైనా అభిప్రాయపడింది. కశ్మీర్ సమస్యతో సంబంధమున్న ఇరువర్గాల్లో ఎవరూ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పింది. అయితే చైనా మినహా భద్రతామండలిలో మరే దేశమూ పాక్ కు మద్దతుగా మాట్లాడలేదు. పాకిస్తాన్ ఎప్పటిలాగే భారత్ పై విషం చిమ్మింది. కశ్మీర్ భారత్ అంతర్గత వ్యవహారం కాదని, అదో అంతర్జాతీయ సమస్యని కామెంట్ చేసింది. దశాబ్దాల తర్వాత ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ పై చర్చ జరగడం తమకు దౌత్యపరంగా అతిపెద్ద విజయమని చెప్పుకుంది. 

పాకిస్తాన్ కు భద్రతామండలిలో ఎలాంటి ఊరట దక్కలేదని భారత్ చెప్పింది. అత్యవసర సమావేశం కోసం లేఖ రాస్తే.. ఇష్టాగోష్టికే పరిమితమైందని సెటైర్లేసింది. కశ్మీర్లో ఎలాంటి మానవహక్కుల ఉల్లంఘన జరగడం లేదని భారత్ స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం తమదేనని గుర్తుచేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తేనే చర్చలు జరుగుతాయని స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దు పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారమని చెప్పింది. ప్రెస్ మీట్ తర్వాత పాక్ జర్నలిస్టుకు ఐక్యరాజ్యసమితిలో భారత్ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. భారత్ ఎప్పుడూ హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. అయితే అంతకుముందు పాక్ ఉగ్రబాట వీడాలని చెప్పారు. 

కశ్మీర్ సమస్య ద్వైపాక్షిక వ్యవహారమని మీటింగ్ కు ముందే.. రష్యా ప్రతినిధి స్పష్టం చేశారు. సమావేశంలో పాల్గొన్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ప్రతినిధులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది అనధికార సమావేశం కావడంతో.. భద్రతామండలి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే భద్రతామండలి సమావేశం తర్వాత నిరాశ చెందిన పాకిస్తాన్.. అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని యోచిస్తోంది. అక్కడ కూడా దాయాదికి ఎదురుదెబ్బ తప్పదని భారత్ దౌత్యవేత్తలు చెబుతున్నారు. 





మరింత సమాచారం తెలుసుకోండి: