ఎన్నికలకు ముందు జనసేనాని ప్రచారానికి వచ్చిన స్పందనతో ఆ పార్టీ ఫలితంపై ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమయింది.ఏపీలో రాజకీయ పార్టీల గెలుపోటములపై జనసేన ప్రభావం ఉంటుందని గణనీయంగా ఓట్లను చీల్చి ఫలితాలను తారుమారు చేస్తుందని, అదే సందర్భంలో జనసేన కనీసం పది ఎమ్మెల్యే సీట్లనైనా గెలుస్తుందన్న లెక్కలు వినిపించాయి. అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం ఆ అంచనాలను తలకిందులు చేశాయి.
వార్ వన్‌సైడ్ అయి వైసీపీ 151 స్థానాలను దక్కించుకుంటే టీడీపీ కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక మిగిలిన ఒక్క స్థానాన్ని జనసేన తన ఖాతాలో వేసుకోగలిగింది.వెలువడిన ఎన్నికల ఫలితాలతో ఇక జనసేన పని అయిపోయిందన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో సర్వత్రా వినిపించింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, అతని సోదరుడు నాగబాబుతోపాటు చరీష్మా ఉన్న నాదెండ్ల మనోహర్, జేడీ లక్ష్మీ నారాయణ వంటి వారు కూడా ఓటమిపలవడంతో ఇక జనసేన ఛాప్టర్ క్లోజ్ అని అందరూ భావించారు.
భవిష్యత్తులో కొత్తగా ఆ పార్టీవైపు చూసేవారు.. వచ్చి చేరేవారు ఇంకెవరూ ఉండరని భావించారు. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ మాత్రం మరోసారి విలీన మంత్రం పటిస్తున్నారు.ఎన్నికల ప్రచార సభల్లో వినిపించిన ఆ పల్లవిని తిరిగి వినిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. తాజాగా జనసేనను విలీనం చేయాలంటూ మళ్లీ తనపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పుకొస్తున్నారు. పవన్ చేస్తున్న వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పార్టీపని అయిపోయిందనుకుంటున్న తరుణంలో జనసేనను విలీనం చేయమంటోంది ఎవరు..? అన్న చర్చ జరుగుతోంది. బీజేపీ వంటి పార్టీలు పవన్‌పై ఒత్తిడి పెంచుతున్నాయా..? లేక తన పార్టీకి ఇంకా డిమాండ్ తగ్గలేదని చాటుకోవడానికి పవన్ కళ్యాణే విలీనమంత్రం పఠిస్తున్నారా..? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.