చిదంబరం బెయిల్ పిటిషన్‌ను దర్యాప్తు సంస్థలు తప్పుబట్టాయి. విచారణ నుంచి తప్పించుకునేందుకు చిదంబరం ప్రయత్నిస్తున్నారని కోర్టుకు వివరించాయి. వారి వాదనతో ఏకీభవించిన కోర్టు... చిదంబరం అభ్యర్థనను తోసిపుచ్చింది. యూపీఏ హయాంలో జరిగిన ఐఎన్‌ఎక్స్ మీడియా ఒప్పందంలో.. నిబంధనలు విరుద్ధంగా 300 కోట్లకు పైగా విదేశీ పెట్టుబడులు వచ్చాయని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ అగ్రిమెంట్ జరిగిన సమయంలో కేంద్ర ఆర్థికమంత్రిగా చిదంబరం ఉన్నారు. నిబంధనలను పక్కనబెట్టి ఐఎన్‌ఎక్స్ మీడియాలో.. విదేశీ పెట్టుబుడలకు అనుమతి ఇచ్చారని, ఇందుకు భారీగా ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఐఎన్‌ఎక్స్ మీడియా ముడుపుల కేసులో చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తి చిదంబరం, ఇంద్రాణీ ముఖర్జీలు నిందితులుగా ఉన్నారు. గతేడాది కార్తిని అరెస్ట్ చేసిన దర్యాప్తు సంస్థలు 23 రోజుల పాటు కస్టడీలో ఉంచి విచారణ చేపట్టాయి. అయితే ఇటీవల ఇంద్రాణీ అప్రూవర్‌గా మారారు. మరోవైపు.. ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించకపోవడంతో.. సుప్రీంను ఆశ్రయించారు చిదంబరం. ఆయన తరఫున లాయర్లు సుప్రీంలో పిటిషన్ వేశారు.
అత్యున్నత న్యాయస్థానం వైపు ఆశగా ఎదురుచూస్తున్న చిదంబరం.. కేసు నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇటు పార్టీ కూడా ఆయన తగిన సహాయ సహకారాలు అందిస్తోంది. ఈ కేసు నుంచి బయటపడితే పార్టీకి ఉన్న మచ్చ తొలిగిపోనుంది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నపుడు చిదంబరం కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఆయన కొన్ని సందర్భాల్లో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి సుప్రీంలో చిదంబరానికి ఊరట లభిస్తుందో లేదో చూడాలి.