కర్ణాటకలో యడ్యూరప్ప మంత్రివర్గం కొలువు దీరింది. దాదాపు పాతిక రోజుల క్రితం కుమార స్వామి సర్కారు బలనిరూపణ చేసుకోవడంలో విఫలమైన నేపథ్యంలో ఆయన పదవి నుంచి దిగిపోయారు. ఆ తర్వాత గవర్నర్ యడ్యూరప్ప కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆ సమయంలో యడ్యూరప్ప ఒక్కడే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. 


ఆ తర్వాత చాలారోజుల పాటు ఆయన మంత్రి వర్గాన్ని విస్తరించనేలేదు. దీనిపై కాంగ్రెస్ నేతలు విమర్శలు కూడా చేశారు. దాదాపు మూడు వారాల పాటు యడ్యూరప్ప ఒక్కరే మంత్రివర్గంగా ఉన్నారు. దీన్ని  కాంగ్రెస్ నేతలు మోడీ నినాదమైన మినిమం గవర్నమెంటు’కు ఇది ఉదాహరణ అంటూ వెటకారం ఆడారు. మొత్తానికి  నాటకీయ పరిమాణాల అనంతరం కర్ణాటకలో కొలువుదీరిన యడియూరప్ప ప్రభుత్వం ఎట్టకేలకు మంత్రి వర్గ విస్తరణ చేపట్టింది. 


యడ్యురప్ప తన కేబినెట్‌లో 17 మంది మంత్రులకు స్థానం కల్పించారు. మంగళవారం మంత్రుల  ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా  ఓ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఓ మంత్రి .. మంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అనే బదులు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అనేశారు.. ఆ తర్వాత నాలిక్కరుచుకున్నారు. 


మధు స్వామి అనే మంత్రి... ‘మంత్రి’ అనే పదానికి బదులు ‘ముఖ్యమంత్రి’ అనేశారు. దాంతో ఒక్కసారి అంతా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత నవ్వుకున్నారు. సీఎం యడ్యురప్ప కూడా ఈ పొరపాటును చూసి నవ్వుకున్నారు. మధు స్వామి ప్రమాణ స్వీకరం చేసిన తర్వాత ఆయన్ను  ఆలింగనం చేసుకున్నారు. 
అయితే మంత్రి వర్గ విస్తరణతోనే కొత్త ముఖ్య మంత్రి యడ్యూరప్పకు అసమ్మతి కష్టాలు మొదలైనట్టు తెలుస్తోంది. మంత్రి పదవులు ఆశించిన కొందరు అప్పుడే అసమ్మతి రాగం ఆలపిస్తున్నారట. దీంతో బీజేపీ సర్కారులో లుకలుకలు మొదలయ్యాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి వీటిని యడ్డీ ఎంతవరకూ నెట్టుకొస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: