ఏపీలో తొలిసారి అధికారంలోకి రావడంతో జగన్..గత టీడీపీ ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల, దేవాలయాల చైర్మన్లని దించేసి తమ పార్టీ నేతలని ఆ పోస్టుల్లో పెట్టేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ నేతలు రాజీనామాలు చేసేశారు. దీంతో ఖాళీ అయిన పోస్టుల్లో వైసీపీ నేతలు పదవులు అలకరించారు. అలాగే కొందరు అధికారులని కూడా బదిలీ చేసి..తమకు కావాల్సిన అధికారులని పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ ప్రభుత్వం హయాంలో విజయవాడ దుర్గ గుడి ఈవోగా కోటేశ్వరమ్మ నియమితులయ్యారు.


అయితే ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు ఆమెని బదిలీ చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఇద్దరు మంత్రులు ప్రజారాజ్యంలో కూడా కలిసి పని చేశారు. ఇప్పుడు వైసీపీలో ఉండి తొలిసారి మంత్రులయ్యారు. అయితే ఈ ఇద్దరు మంత్రులకు ఈవో కోటేశ్వరమ్మ శత్రువైపోయింది. ఎందుకంటే ఈమె టీడీపీ హయంలో నియమించిన వ్యక్తి కావడం. పైగా తమకు నచ్చిన అధికారిని నియమించుకోవాలని కారణం ఒకటి.


పైగా తూర్పుకి చెందిన ఒక మంత్రి తన బామ్మర్ధి గుడికి వస్తున్నాడని చెప్పి మాడపటి గెస్ట్ హౌస్ లో సూట్ రూమ్ కావాలని చెప్పి, బామ్మర్దికి రూమ్ ఇప్పించుకున్నారు. కానీ అక్కడి సిబ్బంది పూర్తి వివరాలు తీసుకుని ఐడీ కార్డు ఇవ్వాలని కోరారు. దీంతో మంత్రికి చిర్రెత్తుకొచ్చింది. నా బామ్మర్దినే ఐడీ అడుగుతారని చెప్పి, మిత్రుడైన మరో మంత్రికి చెప్పి ఈవోని అక్కడ నుంచి పంపేయాలని ప్రభుత్వ పెద్దల మీద ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు.


ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈవో భర్త ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి మంగళగిరి నుంచి పోటీ చేద్దామని అనుకున్నారు. కానీ ఆ సీటు లోకేశ్ కి కేటాయించడంతో సైలెంట్ అయిపోయారు.  ఇదే ఇప్పుడు మంత్రులకు ఆయుధంగా దొరికింది. భర్త టీడీపీ నాయకుడు అని, ఆమె కూడా టీడీపీ మద్ధతుదారు అని ప్రభుత్వ పెద్దలకు చెప్పి ఆమెని బదిలీ చేయించాలని చూస్తున్నారు. 


అయితే ఈఓ కొటేశ్వరమ్మ దుర్గ గుడి బాధ్యతలు చేపట్టిన తర్వాత దుబారా గణనీయంగా తగ్గించారు. గత ఏడాది దసరా ఉత్సవాలను అతి తక్కువ ఖర్చుతో బాగా నిర్వహించారు. కానీ విధి నిర్వహణలో కఠినంగా ఉండే ఆమె ఇప్పుడు రాజకీయానికి బలైపోయేలా కనిపిస్తోంది. మరి చూడాలి ప్రభుత్వం ఈవో విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.


మరింత సమాచారం తెలుసుకోండి: