వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు వైయస్‌ విజయమ్మ, వైయస్‌ భారతి, వైయస్‌ షర్మిలపై ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా కమిషన్‌ చైర్ పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రసంగించిన వాసిరెడ్డి పద్మ.. ఈ ముగ్గురి గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. వైయస్‌ విజయమ్మ, వైయస్‌ భారతి, వైయస్‌ షర్మిల ముగ్గురూ నేటి మహిళలకు ఆదర్శమంటూ వ్యాఖ్యానించారు.


ఆ ముగ్గురూ మహిళలకు ఎందుకు ఆదర్శమో ఆమె వివరించారు. వైయస్‌ఆర్‌ కుటుంబంలోని వైయస్‌ విజయమ్మ, భారతమ్మ, షర్మిలమ్మ ఈ ముగ్గురు మహిళలు కష్టాలు ఎలా ఎదుర్కొన్నారో.. గుర్తు తెచ్చుకోవాలన్నారు. మహిళలు బాధగా ఉన్నప్పుడు ఈ ముగ్గురిని గుర్తు చేసుకోవాలన్నారు. కష్టాలు ఎప్పుడు ఉండవన్నారు. వైయస్‌ఆర్‌ కుటుంబంలోని ముగ్గురు మహిళలు చిరునవ్వుతో ఎలా ఎదుర్కొన్నారో..మనం కూడా అలాగే ఎదుర్కొందామన్నాని, చేయి చేయి కలిసి కలిసికట్టుగా ముందుకు సాగుదామని వాసిరెడ్డి పద్మ అన్నారు.


మహిళా కమిషన్‌ అంటే నేరం జరిగిన తరువాత వెళ్లి పరామర్శించేది కాదని, నేరం జరగకముందే వాటిని నియంత్రించేందుకు ఈ కమిషన్‌ పని చేస్తుందన్నారు. చిన్నతనంలోనే ఆడ, మగ తేడా లేకుండా చూసేందుకు కృషి చేస్తామన్నారు. వైయస్‌ జగన్‌ రాష్ట్రంలోని మహిళలందరికీ అన్నగా అండగా ఉంటారని చెప్పారు. ఈ ప్రభుత్వంలో మహిళా కమిషన్‌ సాధికారత సాధిస్తుందన్నారు. మహిళలందరికీ మంచి రోజులు వచ్చాయన్నారు.


ఇక జగన్ సర్కారు పనితీరుపై వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ... నామినేటెడ్‌ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, స్థానికులకు పరిశ్రమల్లో 75 శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఇటీవల ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చట్టం చేశారని తెలిపారు. మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా వారి కాళ్లపై నిలబడాలని వైయస్‌ జగన్‌ ప్రభుత్వం భావిస్తోందని, అందులో భాగంగానే దశలవారీగా మద్యపాన నిషేదం కార్యక్రమాన్ని మొదలుపెట్టారని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: