అంతర్జాతీయ స్ధాయిలో హైదరాబాద్ వేదికగా మైమ్ ఉత్సవాలు జరగబోతున్నాయి. ఈ ఉత్సవాలు దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి కావడం గమనార్హం. అతి పెద్ద ఉత్సవం మైమ్ ఆర్ట్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ - 2019 ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం మరో విశేషం. భూమిపై పుట్టున ప్రతి వ్యక్తి తొలుత తన భావ ప్రకటనను మూకాభినయంతోనే వ్యక్తపరుస్తారన్నది జగమెరిగిన సత్యమే. అదేవిధంగా రంగస్థలంపై ప్రదర్శించే ప్రతి కళకు మైమ్ కళ తోడవుతూ ఉంటుంది కళాభిమానులు తెలియంది కాదు. మూకాభినయం కళ లేనిదే.. మరే రంగస్థల కళ లేదని చెప్పొచ్చు. ప్రతి రంగస్థల కళకు ఆది అంతం మైమ్ కళే. అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ కళకు సంబంధించిన ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, ఇండియన్ మైమ్ అకాడమీ, అలయెన్స్ ఫ్రాంచైజ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో తొమ్మిది రాష్ర్టాల మూకాభినయం కళాకారులు 50 మందికి పైగా పాల్గొంటున్నారు.
విదేశాల నుంచి మైమ్ కళలో ప్రపంచస్థాయిలో పేరుగాంచిన ఇద్దరు నిఫుణులు వస్తున్నారు. వారిలో ఒకరు ఫాదర్ ఆఫ్ మోడ్రన్ మైమ్ మార్సెల్ మార్సో వద్ద 25 ఏండ్లపాటు పని చేసినవారు.. పారిస్‌కు చెందిన ఎలీనా సెర్రా ఫ్రాన్స్ నుంచి అనే నిఫుణురాలు. కాగా, మరొకరు బంగ్లాదేశ్‌కు చెందిన ప్రఖ్యాత మైమ్ నిఫుణులు మైమ్ హాసన్. వేడుకలో భాగంగా ప్రతిరోజు ఉదయం వేళల్లో దేశీయ, విదేశీ నిఫుణులచే మూడు రోజులపాటు ఔత్సాహికులకు పలు వర్క్‌షాపులు నిర్వహించనున్నారు. రంగస్థల కళల్లో ప్రముఖమైన.. ప్రధానమైన కళ మైమ్. ఈ నేపథ్యంలోనే మూకాభినయం ప్రపంచ వ్యాప్తంగా గొప్పగా ఆవిష్కరించబడి, రకరకాల రూపాలను దాల్చింది. ఈ కళ ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని సంతరించుకొని నిత్యం నూతన ఆవిష్కరణలతో నిగనిగలాడుతోంది.తెలుగులో మూకాభినయంగా పిలుస్తారు. మూకాభినయం అనే పదం ఎంతో మహత్తు కలిగినది. ఎందుకంటే..
నాట్యం, నృత్య రీతుల మాదిరే సంగీతంలో పలు రాగాల మాదిరుగా ఎన్నో రూపాలతో అమరి ఉంది మూకాభినయం. ఈ కళలో తర్ఫీదు పొందాలనుకునే ఔత్సాహికుల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది నిష్ణాతులు ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ మైమ్ కళా నిఫుణులు పద్మశ్రీ నిరంజన్ గోస్వామి, సుభేందు ముఖోపాధ్యాయ, సభ్యసాచి దత్తా, చెన్నైకి చెందిన స్రవంతి రమణి, మణిపూర్‌కు చెందిన ప్రముఖ మైమ్ నిఫుణులు సదానంద్, కేరళ నుంచి సురేష్, అస్సామ్ నుంచి ప్రణబ్ జ్యోతి, హిరు, మధ్యప్రదేశ్ (భోపాల్) నుంచి అరుణ్ సక్సేనా తదితరులు హాజరుకానున్నారు.అవగాహన సదస్సుల్లో పాల్గొనడానికి 80 మంది ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు అందగా, అందులో 30 మందికి మాత్రమే అవకాశం కల్పించినట్టు తెలిసింది. ప్రదర్శనలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు ప్రదర్శనలు కొనసాగనున్నాయి.