ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టంలోనే రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న నియోజకవర్గ కేంద్రమైన కుప్పం.. ఇక పురపాలక సంఘంగా మారనుంది. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేసి.. పంపాలంటూ గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఎనిమిది గ్రామ పంచాయితీలతో కుప్పంను మున్సిపాలిటీగా చేయాలంటూ ప్రతిపాదనలు తయారు చేసి.. ప్రభుత్వానికి నివేదికను పంపారు అధికారులు. 


మేజర్‌ గ్రామ పంచాయతీగా ఉన్న కుప్పంను మున్సిపాలిటీగా మార్చేందుకు మూడేళ్ల క్రితం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కొన్నాళ్లకు కేంద్ర ప్రభుత్వం రూర్బన్‌ పథకాన్ని తీసుకురాగా.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూర్బన్‌ పథకంలో కుప్పాన్ని ఎంపిక చేసింది. కుప్పంతో పాటు చుట్టుపక్కల 7 గ్రామ పంచాయతీలను రూర్బన్‌లో కలిపింది. 100 కోట్ల రూర్బన్‌ పథక నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టినా... అందులో కొన్ని ముందుకు సాగక ప్రారంభంలోనే నిలిచిపోయాయి. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో రూర్బన్‌ నిధులు వెనక్కి వెళ్లాయి. అటు మున్సిపాలిటీగా మారకపోగా.. రూర్బన్‌ పథకంలో భాగంగా కుప్పంలో అభివృద్ధి జరగలేదు. 


టీడీపీ ప్రభుత్వ కాలంలో మూడేళ్ల క్రితం కుప్పం మేజర్‌ గ్రామ పంచాయతీతో పాటు సమీపంలోని మరో పది గ్రామ పంచాయతీలను కలిపి మున్సిపాలిటీగా మార్చేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. మున్సిపాలిటీ కాకపోవడంతో గుడుపల్లె పరిధిలోని గుండ్లసాగరం, శెట్టిపల్లె, బెగ్గిలిపల్లె పంచాయతీలను తొలగించి మిగిలిన పంచాయతీలతో కలిపి కుప్పంకు  రూర్బన్‌ పథకం వర్తించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. గతనెల నూతన ప్రభుత్వం మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు కోరింది. అధికారులు రూర్బన్‌ పథకంలోని గ్రామాలను విలీనం చేస్తూ ప్రతిపాదనలు పంపించారు. 


కుప్పం మేజర్‌ గ్రామ పంచాయతీతో పాటు పట్టణానికి సమీపంలోని చీలేపల్లె, దళవాయికొత్తపల్లె, సామగుట్టపల్లె, చీమనాయనపల్లె, తంబిగానిపల్లె, కమతమూరు, అనిమిగానిపల్లెలను కలిపి ఎనిమిది గ్రామ పంచాయతీలతో కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చేలా ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు చెబుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ మున్సిపాలిటీ ప్రతిపాదిత గ్రామ పంచాయతీల్లో దాదాపు 48 వేల 537 మంది జనాభా ఉన్నారు. ప్రతిపాదనలు ఆమోదం పొంది.. కుప్పం మున్సిపాలిటీగా మారితే పురపాలక నిధులతో అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: