చంద్రయాన్-2 కీలక దశకు చేరుకుంది. ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయింది. ఇప్పటి వరకూ ఐదుసార్లు దాని  కక్ష్య దూరాన్ని తగ్గించారు. సెప్టెంబర్ 7న ప్రయోగం చివరి దశకు చేరుకుంటుంది. రోవర్ బయటకు వచ్చి ప్రయోగాలు చేపట్టి ఆ వివరాలను ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలకు పంపనుంది.  


భారత్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌-2 కీలక దశకు చేరుకుంది. ఈ వ్యోమనౌకలోని ఆర్బిటర్‌ నుంచి 'విక్రమ్‌' ల్యాండర్‌ విడిపోయే కార్యక్రమం విజయవంతమైంది. ల్యాండర్‌ విడిపోయే దృశ్యాలను ఇస్రో శాస్త్రవేత్తలు ఆసక్తిగా పరిశీలించారు. ల్యాండర్‌ విడిపోయిన అనంతరం చందమామ ఉపరితలంపై ల్యాండింగ్‌ ప్రక్రియకు అది మరింత చేరువకానుంది. జులై 22న శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-2 కొద్దిరోజుల పాటు భూ కక్ష్యలో పరిభ్రమించి, ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఆ తర్వాత నాలుగుసార్లు దాని కక్ష్యను ఇస్రో తగ్గించింది. చంద్రయాన్‌-2ను జాబిల్లి చుట్టూ ఉన్న కక్ష్యలోకి చేర్చింది. ఈ కక్ష్య దాదాపుగా వృత్తాకారంలో ఉంది.


చంద్రయాన్‌-2 వ్యోమనౌక పైభాగంలో ల్యాండర్‌ ఉంటుంది. దీన్ని ఆర్బిటర్‌కు అనుసంధానించారు. ఈ రోజు నిర్దేశిత కక్ష్య పరిధిలోకి చేరగానే ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయేలా ఇస్రో సంకేతాలు పంపింది. విడిపోయే ప్రక్రియ కొన్ని మిల్లీ సెకన్లలోనే  పూర్తయింది. ముందుగా ఆర్బిటర్‌, ల్యాండర్‌ను సంధానించే రెండు లింకులు తెగిపోయాయి. దీంతో  ల్యాండర్‌ వేరుపడింది. రేపు, ఎల్లుండి కూడా మరోసారి ల్యాండర్‌ కక్ష్యను తగ్గిస్తారు. దీంతో అది మరో కక్ష్యలోకి చేరుతుంది. ఈ నెల 7న అంతిమ ఘట్టం ఉంటుంది. ఆ రోజున ల్యాండర్‌లోని 'పవర్‌ డిసెంట్‌' దశ ఆరంభమవుతుంది. ఆ వ్యోమనౌకలోని రాకెట్లను మండించడం ద్వారా దాన్ని కిందకు దించుతారు. ఆ తర్వాత 15 నిమిషాల్లో ల్యాండర్‌.. చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రాంతంలో దిగుతుంది. నాలుగు గంటల తర్వాత అందులోని రోవర్‌ బయటకు వస్తుంది.  







మరింత సమాచారం తెలుసుకోండి: