టిడిపి నేత మాజీ ఎంఎల్ఏ
యరపతినేని శ్రీనివాస్ చేసిన అక్రమ మైనింగ్ కేసును విచారణ బాధ్యత సిబిఐకి
అప్పగించాలని క్యాబినెట్ తీర్మానించింది. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్
సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలోనే యరపతినేని అక్రమ మైనింగ్ వ్యవహారం మొత్తాన్ని
విచారణ నిమ్మితం సిబిఐకి అప్పగించాలని డిసైడ్ అయ్యింది.
చంద్రబాబునాయుడు హయంలో ఏపిలోకి సిబిఐకి నో చెప్పిన విషయం అందరకీ తెలిసిందే. అయితే జగన్ అధికారంలోకి రాగానే సిబిఐ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో చంద్రబాబు హయాంలో జరిగిన వ్యవహారాల్లో దేనిపై జగన్ సిబిఐ విచారణకు ఆదేశిస్తారనే ఉత్కంఠ మొదలైంది. ఈ నేపధ్యంలోనే అక్రమ మైనింగ్ కేసును విచారించిన కోర్టు అవసరమైతే ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించవచ్చని సూచించింది.
ఎలాగూ కోర్టు కూడా సూచించింది కాబట్టి యరపతినేని అక్రమమైనింగ్ కేసును సిబిఐతో విచారణ జరిపించాలని క్యాబినెట్ లో డిసైడ్ అయ్యింది. నిజంగానే టిడిపి నేతలు చేసిన అడ్డదిడ్డమైన పనులతో, వ్యవహారాలతో కేసుల్లో ఇరుక్కుంటున్నారు. కొంతమంది నేతలపై కోర్టు ఆదేశాలతోనే పోలీసులు కేసులు పెడుతున్నారు. అయినా కానీ జగన్ టిడిపి నేతలపై తప్పుడు కేసులు పెడుతోందంటూ చంద్రబాబునాయుడు అండ్ కో ఊరు వాడ ఎక్కి ఒకటే గోల చేస్తున్నారు.
అందుకనే యరపతినేని అక్రమమైనింగ్ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగిస్తే తమకు సమస్యలు ఉండవని క్యాబినెట్ అనుకున్నట్లు సమాచారం. నిజానికి మాజీ ఎంఎల్ఏ అక్రమ మైనింగ్ తో వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు కోర్టు దాదాను నిర్ణయించిన విషయం తెలిసిందే.
మాజీ ఎంఎల్ఏ అక్రమ మైనింగ్ ను సరిగా విచారించని సిఐడి, మైనింగ్, రెవిన్యు అధికారులపై కోర్టు మండిపడిన విషయం అందరికీ తెలిసిందే. టిడిపి అధికారంలో ఉన్నపుడు యరపతినేని ఎంఎల్ఏ హోదాలో ఆకాశమే హద్దుగా అవినీతితో చెలరేగిపోయారని వైసిపి నేతలు చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిందే. వారి ఆరోపణలనే కోర్టు దాదాపు సమర్ధించినట్లుగా వ్యాఖ్యలు చేసింది. ఈ నేపధ్యంలోనే అక్రమమైనింగ్ కేసును సిబిఐకి అప్పగించటం సంచలనంగా మారింది.