ఐదేళ్ళ పదవీ కాలంలో
జరిగిన అవినీతి నుండి జనాల దృష్టి మరల్చేందుకే చంద్రబాబునాయుడు తాపత్రయపడుతున్నారా
? క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అదే అనుమానం వస్తోంది. సిఎంగా ఉన్న
ఐదేళ్ళ కాలంలో ఎక్కడ చూసినా అవినీతి కంపే. ఏ పథకం తీసుకున్నా, ఏ ప్రాజెక్టు
తీసుకున్నా ముందు అవినీతికి లాకులెత్తిన తర్వాత పథకాలైనా, ప్రాజెక్టులైనా అమలు
చేసిన విషయం బయటపడుతోంది.
పోలవరం, అమరావతి నిర్మాణం, కేంద్రం నిధులిచ్చిన పథకాల అమలు, పిపిఏలు ఇలా ఏది తీసుకున్నా భారీ ఎత్తున అవినీతే. జగన్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో చంద్రబాబు అవినీతికి సంబంధించి కొంత కూపీ లాగారు. పోలవరం, పిపిఏల్లాంటి వాటిపై నిపుణుల కమిటిలు వేసి ఏ మేరకు అవినీతి జరిగిందనే విషయంలో కొంత వరకూ వివరాలు రాబట్టారు.
జగన్ దూకుడు చూస్తుంటే మరో నాలుగైదు మాసాల్లో చంద్రబాబు అవినీతిని మొత్తం బయటపట్టేలాగున్నారు. అందుకే చంద్రబాబులో టెన్షన్ మొదలైంది. అందుకనే ముందు జాగ్రత్తగానే జగన్ ప్రభుత్వంపై అయినదానికి కాని దానికి ఆరోపణలు, విమర్శలతో ఎగిరెగిరి పడుతున్నారు. ఎలాగూ మెజారిటి మీడియా మద్దతు ఉంది కాబట్టి చంద్రబాబు చేస్తున్న పసలేని ఆరోపణలకు విస్తృత ప్రచారం లభిస్తోంది.
చంద్రబాబు ఐదేళ్ళ అవినీతిపై నిపుణులతో విచారణ చేయిస్తున్నారే కానీ ఇంత వరకూ జగన్ ఒక్కమాట కూడా మీడియా ముందుకొచ్చి మాట్లాడలేదు. అలాగే అధ్యయనం చేసిన నిపుణులు కూడా తమ నివేదికను జగన్ కు ఇచ్చారే కానీ మీడియాతో ఎక్కడా మాట్లాడలేదు. కాకపోతే మంత్రులు బొత్సా, కొడాలినాని లాంటి వాళ్ళ ద్వారా కొన్ని విషయాలు మాత్రం బయటకు పొక్కాయి.
రేపు గనుక నిజంగానే చంద్రబాబు ఐదేళ్ళ అవినీతిపై జగన్ గనుక నోరిప్పితే చాలా ఇబ్బందులు తప్పేట్లు లేదు. అందుకనే భయపెట్టి తన జోలికి రాకుండా చూసుకోవాలనే ఉద్దేశ్యంలో చంద్రబాబు ఉన్నట్లు అర్ధమవుతోంది.