చిత్తూరు జిల్లావాసులు ఎప్పుడెప్పుడా.. అని ఎదురు చూసే తరుణానికి ముహూర్తం ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ లో అనుకున్నంత స్థాయిలో వానలు లేకపోయినా... ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తింది. కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీనీవాకు కృష్ణమ్మ నడక మొదలైంది. కర్నూలు, అనంతపురం జిల్లాలను దాటి చిత్తూరుకు హంద్రీనీవా జలాలు వస్తాయా..? రావా..? అన్న రైతుల అనుమానాలను పటాపంచలు చేస్తూ.. అనంతపురం సాగునీటి అడ్వైజరీ బోర్డు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి జిల్లాకు నీళ్లు వదలాలని నిర్ణయించింది.
కరువు పీడిత ప్రాంతమైన చిత్తూరు జిల్లాకు కృష్ణమ్మ రాక ఖరారైంది. అనంతపురం సాగునీటి అడ్వైజరీ బోర్డు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి చిత్తూరు జిల్లాకు నీళ్లు వదలాలని నిర్ణయించింది. అయిదు నెలలు సాగే ప్రవాహంతో జిల్లాకు కేటాయించిన వాటాలో పుంగనూరు బ్రాంచి కెనాల్ ద్వారా మూడు టీఎంసీలు, ఈలోగా ఎన్.పి.కుంట వద్ద పెండింగ్‌లో ఉన్న సొరంగం పనులు పూర్తయితే, ప్రధాన కాలువ ద్వారా మరో నాలుగు టీఎంసీలు వాడుకునే అవకాశముంటుందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లా మాల్యాల నుంచి వస్తున్న ప్రవాహంతో అనంతపురం జిల్లాలోని జీడీపల్లె రిజర్వాయర్ ఒకటి రెండు రోజుల్లో నిండిపోనుంది. ఇప్పటికే దిగువనున్న చెర్లోపల్లె రిజర్వాయర్ వైపు కృష్ణమ్మ పరుగులిడుతోంది. అక్కడి నుంచి మారాల... మారాల నుంచి జిల్లా సరిహద్దు ప్రాంతమైన పీటీఎంకు హంద్రీనీవా జలాలు రానున్నాయి.
అక్టోబర్ 15వ తేదీ నాటికి మదనపల్లెకు జలాలు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నీటి ప్రవాహం మొదలయ్యాక.. నీటిని ఎక్కడికి పంపాలి.. ? ఏ చెరువులు నింపాలి..? అనే అంశాలపై జిల్లాస్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్ణయించనుంది. పుంగనూరు బ్రాంచి కెనాల్ సామర్థ్యాన్ని బట్టి.. నాలుగు నుంచి ఐదు నెలలు నీటిని తీసుకుంటే, మూడు టీఎంసీలు వాడుకునే అవకాశం ఉంది. ఆలోగా ప్రధాన కాలువలో భాగమైన అనంతపురం జిల్లా నంబులపూలకుంట వద్ద పెండింగ్‌లో ఉన్న వంద మీటర్ల సొరంగం పూర్తయితే మరో నాలుగు టీఎంసీలు తీసుకోవచ్చుని భావిస్తున్నారు. జిల్లాకు కేటాయించిన పది టీఎంసీల్లో ఏడు టీఎంసీలు వాడుకోవచ్చని, కాలువ పనులు సంపూర్ణంగా పూర్తిచేసి, లైనింగ్ పూర్తయితే, కేటాయించిన పది టీఎంసీలు కూడా గడువులోగా తీసుకుని అవకాశం ఉంటుందన్నారు అధికారులు.
శ్రీశైలం నుంచి 2 వేల 500 క్యూసెక్కులు నీరు విడుదల అవుతుండగా.. అనంతపురం జిల్లాలోని జీడీపల్లెకు 800 నుంచి 900 క్యూసెక్కుల నీటి ప్రవాహం మాత్రమే వస్తోంది. మిగిలిన నీరంతా కర్నూలు-అనంతపురం జిల్లాల మధ్యలోని చెరువులు, కుంటలకు మళ్లిస్తున్నారు. రైతుల వినియోగం, సరఫరాలో నష్టాలు వెరసి 1700-1800 క్యూసెక్కులు మార్గమధ్యలో నిలిచిపోతున్నాయి. 1.70 టీఎంసీల సామర్థ్యం గల జీడీపల్లె రిజర్వాయరు ఒకటి, రెండు రోజుల్లో నిండిపోనుండగా, అంతే సామర్థ్యంతో దిగువ ప్రాంతమైన చెర్లోపల్లెకు వదులుతున్నారు. అధికారుల అంచనా ప్రకారం అక్టోబర్ 10 నాటికి జిల్లా సరిహద్దు పీటీఎం మండలానికి, 15 నాటికి మదనపల్లెకు కృష్ణమ్మ చేరాలంటే, జీడీపల్లె నుంచి 1600 క్యూసెక్కులు వదలాలని అధికారులు సూచిస్తున్నారు. ఆ మేరకు అక్కడి కమిటీపై ఒత్తిడి పెంచారు. జిల్లా సరిహద్దుకు చేరేసరికి ప్రవాహం 300 క్యూసెక్కులకు పడిపోతుంది. ఈ కాలువ కెపాసిటీ కూడా అంతే కావడంతో ఉన్నంతలో కృష్ణమ్మ పడమటి ప్రాంతాలకు ప్రవహిస్తుంది. ఇక ఎన్.పి. కుంట వద్ద పెండింగ్‌లో ఉన్న వంద మీటర్ల సొరంగాన్ని పూర్తి చేస్తే 1000 క్యూసెక్కుల ప్రవాహంతో గడువు లోపల మరో నాలుగు టీఎంసీల నీటిని వాడుకోవచ్చునని అధికారులు అటు ప్రభుత్వంపై ఇటు కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెస్తున్నారు. మొత్తానికి వస్తుందా.. రాదా.. అని అనుకున్న కృష్ట జలాలకు అధికారులు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చారనే వార్త జిల్లా రైతుల్లో సంతోషాన్ని నింపిందనే చెప్పాలి.