తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీలో అస‌మ్మ‌తి జ్వాల‌లు ఎగ‌సి ప‌డుతున్నాయి. కొద్ది రోజులుగా పార్టీలో మంత్రుల ద‌గ్గ‌ర నుంచి ఎమ్మెల్యేలు, సీనియ‌ర్ నేత‌లు ఒక్కొక్క‌రు త‌మ అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఈట‌ల రాజేంద‌ర్ గులాబీ జెండాకు తాను కూడా ఓన‌రే అంటే.. ఆ వెంట‌నే మాన‌కొండూరు ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డినా ఇక్క‌డేం జ‌ర‌గ‌లేద‌ని... కేవ‌లం ఆంధ్రా బోర్డు మారి తెలంగాణ బోర్డు మాత్ర‌మే వ‌చ్చింద‌ని సెటైర్ వేశారు.


ఇక ఆదివారం మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌ర‌గ‌డంతో టీఆర్‌ఎస్‌లో అసంతృప్త జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. తాజా కేబినెట్ కూర్పుపై మాజీ హోం మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని కేసీఆర్ మాట ఇచ్చి త‌ప్పార‌ని ఫైర్ అయ్యారు. నాయిని ఫైర్ అయ్యారో లేదో ఆ వెంట‌నే డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే రాజయ్య బాహాటంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.


తెలంగాణలో 11 నుంచి 12 శాతం మాదిగలున్నారని, కానీ కేబినెట్‌లో మాత్రం మాదిగలు లేరని తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిన్న జ‌రిగిన ప్ర‌క్షాళ‌న‌లో కేసీఆర్ ఒక గిరిజ‌న‌, క‌మ్మ‌, మున్నూరు కాపు, రెడ్ల‌తో పాటు ఇద్ద‌రు వెల‌మ‌ల‌కు చోటు ఇచ్చారు. ఇక అంత‌కు ముందే మైనార్టీ, మాల‌ల‌కు కూడా ప్రాధాన్యం ఉంది. మాదిగ‌ల‌కు మాత్రం చోటు లేదు. ఈ క్ర‌మంలోనే రాజయ్య త‌న అసంతృప్తి వ్య‌క్తం చేశారు.
 
తెలంగాణలో మాదిగలు, ఏపీలో మాలలున్నారని తెలిపారు. అయితే మాదిగల గురించి ఎవరో ఒకరు మాట్లాడాలని, విపక్షాలు మాట్లాడితే రాజకీయం చేస్తున్నారని విమర్శిస్తారని రాజయ్య అన్నారు. ఏదేమైనా తెలంగాణ‌లో మ‌రో సీనియ‌ర్ నేత కూడా త‌న అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డంతో మ‌రికొంత మంది అసంతృప్త నేత‌లు, సీనియ‌ర్లు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చి కేసీఆర్‌ను టార్గెట్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే జ‌రిగితే పార్టీలో భారీ ముస‌లం త‌ప్పేలా లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: