కష్టపడితే ఏదైనా సాధ్యమే అని ఓ వైసీపీ మంత్రి నిరూపించారు. నిజాయితీ, నిబద్ధతతో పని చేస్తూ...అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే తన శాఖపై పట్టు సాధించిన ఆ మంత్రి...సీఎం జగన్ నిర్ణయాలకు అనుగుణంగా నడుస్తూ...ప్రజల మన్ననలని పొందుతున్నారు. ఇలా తొలిసారి మంత్రి అయ్యి కష్టపడుతున్న నేత ఎవరో కాదు...వైసీపీ సీనియర్ నాయకుడు, రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని). కృష్ణా జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాని...,మచిలీపట్నం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.


2004, 2009లలో దివంగత వైఎస్సార్ హయంలో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేసిన నాని...వైఎస్సార్ మరణం తర్వాత ఆయన తనయుడు జగన్ స్థాపించిన వైసీపీలోకి వెళ్లారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయిన పేర్ని...2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున విజయం సాధించారు. ఇక ముందు నుంచి కష్టపడే తత్వం ఉండటం, పార్టీకి విధేయుడుగా ఉండటంతో జగన్... నానికి తన కేబినెట్‌లో స్థానం కల్పించారు.  


వాస్త‌వంగా జిల్లాలో ఉన్న సామాజిక స‌మీక‌ర‌ణ‌ల‌ను బ‌ట్టి నానికి మంత్రి ప‌ద‌వి వ‌స్తుందా ?  రాదా ? అన్న సందేహాలు ఉన్నా జ‌గ‌న్ నానిపై న‌మ్మ‌కంతో మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. అది కూడా ప్రభుత్వంలో కీలకమైన రవాణా, సమాచార శాఖని అప్పగించారు. అయితే వైసీపీ మొన్న ఈ మధ్యనే దిగ్విజయంగా వంద రోజుల పాలనని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల్లో మంత్రిగా నాని పనితీరుని ఒకసారి పరిశీలిస్తే...తొలిసారి మంత్రి అయిన నాని...జూనియర్ లా అసలు కనిపించలేదు.


తక్కువ సమయంలోనే అన్ని విషయాల్లో పట్టు తెచ్చుకుని శాఖని గ్రిప్‌లో పెట్టుకున్నారు. అలాగే ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న ఆర్టీసీ విలీన సమస్యకు జగన్ ఆధ్వర్యంలో నడుచుకుంటూ పరిష్కారం చూపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. దీంతో 53వేల మంది ఉద్యోగులకు లబ్ది చేకూరేలా చేశారు. అలాగే వారి పదవీ విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచారు. అటు ఆటోవాలాలు, ట్యాక్సీవాలాలకు పది వేల రూపాయల ఆర్థిక సాయం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.


వచ్చే నెల 4 నుంచి అర్హులైనవారికి ఆర్ధిక సాయం అందనుంది. అలాగే అర్హులైన  జర్నలిస్టులందరికీ ఉగాది నాటికల్లా ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించారు. ఇక నాని మంత్రిగానే కాకుండా ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించి ప్రజల మన్ననలు పొందుతున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష టీడీపీ చేసే విమర్శలని వెంటనే తిప్పుకొడుతూ...ప్రభుత్వానికి అండగా నిలబడుతున్నారు. మొత్తం మీద ఈ వంద రోజుల్లో పేర్ని నాని మంత్రిగా మంచి మార్కుల‌తో ముందుకు వెళుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: