గల్ఫ్‌ మరో  యుద్ధాన్ని చూడబోతోందా ?  ఇరాన్ ను బూచీగా చూపిస్తూ... పెద్దన్న  కాలుదువ్వుతున్నాడా ? సౌదీ అరేబియా చమురు బావులపై జరిగిన దాడులు యుద్ధానికి దారితీసేలా కనిపిస్తున్నాయ్. దీనిపై ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా ప్రకటించటం ప్రపంచ దేశాలను  వణికిస్తోంది. దీంతో గల్ఫ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ దాడులు ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరగటానికి  కారణమవుతున్నాయి.    


గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకొంటున్నాయి. సౌదీ అరేబియా చమురు బావులపై ఇటీవల దాడులు జరిగాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్‌పై దాడికి సిద్ధంగా ఉన్నట్లు అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన చేశారు. ఈ ప్రకటన గల్ఫ్ లో యుద్ధం తప్పదనే సంకేతాలను ఇస్తోంది. సౌదీ ప్రభుత్వ చమురు క్షేత్రాలపై జరిగిన డ్రోన్‌ దాడులతో ఆ దేశం చమురు ఉత్పత్తి  సగానికి సగం పడిపోయింది. యుద్ధం మొదలైతే అంతర్జాతీయంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్న అనుమానాలు ఏర్పడ్డాయి. అనుకున్నట్టుగానే ముడి చమురు ధరలు 20శాతం వరకు పెరిగిపోయాయి. గత శనివారం డ్రోన్‌ దాడులు జరిగితే సోమవారం క్రూడ్‌ ఆయిల్ ధరలు 12 డాలర్లు పెరిగి 67 డాలర్లకు చేరాయి. 1998 గల్ఫ్‌ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో చమురు ధరలు  పెరగడం ఇదే ప్రథమం. డ్రోన్‌ దాడికి కారకులెవరో తమకు తెలుసనీ, సౌదీ అరేబియా మాట కోసం ఎదురు చూస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు. 


యెమన్‌లోని హుతీ తిరుగుబాటుదారులు అక్కడి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన పొరుగుదేశం సౌదీ అరేబియాపై ఐదేళ్లుగా యుద్ధం చేస్తున్నారు. తిరుగుబాటుదారులకు షియా దేశమైన ఇరాన్‌ మద్దతుగా నిలిచింది. తాజా డ్రోన్‌ దాడులకు పాల్పడింది ఎవరనేది స్పష్టత లేదు. అమెరికా మిత్రదేశమైన ఇరాక్‌ గడ్డ మీద నుంచే డ్రోన్‌లు వచ్చాయనే  కథనాలు వినిపించాయి. అయితే ఈ కథనాలను ఇరాక్‌ ప్రభుత్వం ఖండించింది. అమెరికా ఇరాన్‌పై ప్రతీకార దాడులకు దిగుతుందనే అనుమానాలు బలపడుతున్నాయి. అమెరికా, బ్రిటన్‌లు తమ  ఆయిల్‌ రిజర్వులను తెరిచి, దైనందిన అవసరాలకు వినియోగిస్తామని ప్రకటించడం కూడా యుద్ధం ఊహాగానాలకు బలం చేకూర్చాయి. ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు, కరెన్సీ విలువలు  పడిపోయాయి. రూపాయి విలువ పడిపోవడంతో చమురు ధరలు మరింత పెరిగాయి. భారతదేశం కూడా పెరుగుతున్న చమురు ధరల పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధమైంది. భారత్‌కు రెండో అతి  పెద్ద చమురు సరఫరాదారు సౌదీ అరేబియానే. ముడిచమురు ధరలు పదిశాతం పెరిగితేనే భారత్‌ కరెంటు ఖాతా లోటు జీడీపీలో 0.5 శాతం పెరుగుతుంది.


ఇక భారత్‌ చమురు అవసరాల్లో 83 శాతాన్ని దిగుమతులే తీరుస్తున్నాయి. దాంతో అంతర్జాతీయ పరిణామాలు భారత్‌ ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. తాజా పరిణామాల నేపథ్యంలో భారత్‌లో చమురు ధరలు భారీగా పెరనున్నాయి. మున్ముందు పెరుగుదల మరింత ఉండవచ్చని భావిస్తున్నారు. భారత్‌కు చమురు కొరత లేకుండా చేస్తామని సౌదీ  అరేబియా ప్రభుత్వం హామీ ఇచ్చింది. సౌదీ ప్రభుత్వరంగ సంస్థ అరామ్‌కో కంపెనీ ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. ఒకే గ్రేడ్‌ చమురు సరఫరా చేయలేక పోవచ్చని, వివిధ గ్రేడ్ లు అందజేస్తామని  చెప్పింది. భారత్‌కు 65 రోజులకు సరిపడా ఆయిల్‌ రిజర్వులున్నాయి. అవి పూర్తయ్యే లోగా సంక్షోభం సమసిపోతే చమురు ధరలు దిగివస్తాయి. ప్రస్తుతం భారత్‌ రోజుకు 45 లక్షల బ్యారెళ్ల ముడి  చమురు దిగుమతి చేసుకుంటోంది. గత ఏడాదితో పోలిస్తే ముడి చమురు దిగుమతులు స్వల్పంగా తగ్గాయి. ఆ మేరకు శుద్ధి చేసిన చమురు దిగుమతులు పెరిగాయి.


యెమన్‌ తీవ్రవాదులుగా భావిస్తున్న వారు.. సౌదీ అరేబియా ప్రభుత్వానికి చెందిన అతిపెద్ద చమురు క్షేత్రం, అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారంపై డ్రోన్‌ దాడులకు  పాల్పడ్డారు. రెండూ భారీ పేలుళ్లతో తగులబడి పోయాయి. ప్రపంచ చమురు ఉత్పత్తిలో ఆరు శాతం ఇక్కడి నుంచే జరుగుతోంది. నష్టపోయిన ఉత్పత్తిలో 40 శాతాన్ని వెంటనే పునరుద్ధరిస్తామని,  మొత్తం పునరుద్ధరించడానికి మరో వారం రోజులు పడుతుందని సౌదీ అరేబియా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: