జగన్మోహన్ రెడ్డికి
ప్రభుత్వ డాక్టర్ల షాక్ తప్పదా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ
డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీసును బ్యాన్ చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం
తెలిసిందే. బ్యాన్ చేసే దిశగా ప్రభుత్వం
ఉత్తర్వులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈలోగానే ప్రభుత్వ నిర్ణయంపై ప్రభుత్వ డాక్టర్లలో వ్యతిరేకత మొదలైంది.
తమ ప్రైవేటు ప్రాక్టీసుపై ప్రభుత్వం బ్యాన్ చేసే ఆలోచనను అంగీకరించే ప్రసక్తే లేదని ప్రభుత్వ వైద్యులు తెగేసి చెబుతున్నారు. అవసరమైతే ప్రభుత్వ సర్వీసును వదులుకుంటామే కానీ ప్రాక్టీసును మాత్రం పక్కన పెట్టేది లేదని స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఈ విషయమై నిర్ణయం తీసుకునేందుకు విజయవాడలో అత్యవసర సమావేశం నిర్వహించాలని కూడా డిసైడ్ అయ్యారు.
జగన్ నిర్ణయం గనుక అమల్లోకి వస్తే తక్షణమే సుమారు 500 మంది స్పెషలిస్టు డాక్టర్లు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. వీరంతా వివిధ విభాగాల్లో నిపుణులుగా సంవత్సరాలతరబడి పనిచేస్తున్నవారే. ఇందులో కూడా డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఏపి వైద్య విధాన పరిషత్ లోనే పని చేస్తున్నారు. మరి ఒక్కసారిగా పై శాఖల్లో పనిచేస్తున్న డాక్టర్లలో 500 మంది రాజీనామా చేయటమంటే చిన్న విషయం కాదు.
ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాల్సిందే. నిజానికి సుజాతారావు నివేదిక అమలు విషయంలో జగన్ తొందర పడ్డారనే చెప్పాలి. ఎలాగంటే నివేదిక అధ్యయనం చేసిన తర్వాత ముందుగా మాట్లాడాల్సింది ప్రభుత్వ డాక్టర్ల సంఘం నేతలతోనే. ఈ విషయాన్ని మరచిపోయిన జగన్ నివేదికను యధాతధంగా అమలు చేయబోతున్నట్లు చెప్పేశారు.
అసలు సమస్యంతా ఇక్కడే మొదలైంది. ఇంత సున్నితమైన విషయంపై జగన్ నిర్ణయం తీసుకుంటున్నపుడు మరి పక్కనున్న సలహాదారులంతా ఏమి చేస్తున్నారో అర్ధం కావటం లేదు. జగన్ సలహాదారులుగా చాలామందే ఉన్నారు. పైగా వైద్య, ఆరోగ్య శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా ఉన్నారు కదా ? జగన్ నిర్ణయంపై డాక్టర్లు ఎలా స్పందిస్తారన్న విషయాన్ని ముందుగా అంచనా వేయటంలో అందరూ ఫెయిలైనట్లే కనిపిస్తోంది. తన నిర్ణయంపై ముందుకు వెళితే ఓ సమస్య. వెనక్కు పోతే మరో సమస్య. మరి ఇపుడు జగన్ ఏం చేస్తారో చూడాల్సిందే.