నిలోఫర్‌ వైద్యుల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. చిన్నారులకు వైద్యం అందించాల్సిన వైద్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ నిలోఫర్‌ ఆసుపత్రి పేరును చెడగొడతున్నారు. ఇద్దరు వైద్యుల మధ్య వైరం కాస్త ముదిరిపాకానపడింది. చివరికి చిన్నారులపై ఎలాంటి అనుమతులు లేకుండా క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారని... ఆసుపత్రిలో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడం చట్టవిరుద్దమని.. కొందరు వైద్యులు డిఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేయడంలో అసలు విషయం బయటపడింది. 


నిలోఫర్‌ ఆసుపత్రి ప్రతిష్ట మసకబారుతోంది. ఎప్పుడు ఏదో వివాదంలో వార్తల్లో నిలిచే నిలోఫర్‌ వైద్యులు తాజాగా అభం, శుభం తెలియని చిన్నారులపై.. మందుల కంపెనీల కోసం క్లినికల్‌ ట్రయల్స్ నిర్వహిస్తున్నానే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు తోడుగా కొందరు వైద్యులు అన్ని ఆధారాలతో డిఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశారు. సంచలనం సృష్టించిన ఈ ఫిర్యాదుపై డిఎంహెచ్‌వో రమేష్‌ రెడ్డి వెంటనే స్పందించి నిలోఫర్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ పై విచారణకు ఆదేశించారు. నిన్నటి నుంచి నిలోఫర్‌ ఆసుపత్రిలో అంతర్గత విచారణ కొనసాగుతోంది.


చట్టవిదుద్దంగా చిన్న పిల్లల శరీరాలపై ప్రయోగాలు చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పిడియాట్రిషన్‌ ఫ్రొఫెసర్‌ రవికుమార్‌ ఈ ఆరోపణలను కొట్టి పారేశారు. గత కొన్ని సంవత్సరాలుగా కొత్త మందులు, డ్రగ్స్‌ కోసం ఇలాంటి ప్రయోగాలు సర్వసాధారణంగా చేస్తుంటామని... నిలోఫర్‌లోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద ఆసుపత్రిలన్నింటిలో ప్రయోగాలు చేస్తుంటామన్నారు. తాము ప్రయోగాలు చేయడం మూలంగానే కొత్త మందులు మార్కెట్ లోకి వస్తాయని రవికుమార్ చెబుతున్నారు. అంతేగాక గతంలో నిలోఫర్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్ రమేష్‌ రెడ్డి నేతృత్వంలోని ఎథిక్‌ కమిటీ అనుమతులు, సూచనల మేరకే ఇప్పటికీ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.


ఇదిలా ఉంటే గత కొంత కాలంగా ఆసుపత్రిలో పని చేస్తున్న కొందరు వైద్యుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.  సీనియర్లు, జూనియర్లు అని, వ్యక్తిగత కక్షల మూలంగా ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకుంటూ ఆసుపత్రికి చెడ్డ పేరు తెస్తున్నారని కొందరు వైద్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న చిన్న పిల్లల వైద్యుడు తోటి వైద్యుల పట్ల దురుసుగా ప్రవర్తించడమే గాక మహిళా వైద్యులను చులకన చేసి మాట్లాడుతూ వాళ్లను మానసికంగా వేధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు అంతా సక్రమంగా జరిగిన క్లినికల్‌ ట్రయల్స్ విషయం రాత్రికి రాత్రి ఫిర్యాదులు చేయడం.. వెంటనే డిఎంహెచ్‌వో స్పందించడం అంతా చకచకా జరిగిపోయాయి.


నిలోఫర్‌ ఆసుపత్రిలో ఏం జరుగుతుందో అర్ధం కాక రోగులు, వారి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రికి చిన్నారులను తీసుకువస్తే చిన్నారులకు ఎలాంటి మెడిసిన్‌ ఇస్తున్నారో కూడా తమకు తెలియదని తల్లిదండ్రులు వాపోతున్నారు. చిన్నారులకు ఎలాంటి ఇంజెక్షన్‌ ఇస్తున్నారో, చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో కనీసం తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక క్లినికల్‌ ట్రయల్స్‌ విషయం తమకు తెలియకుండానే జరగిపోతుందని తల్లిదండ్రులు చెప్పుకొస్తున్నారు.


క్లినికల్‌ ట్రయల్స్‌కు ఎలాంటి అనుమతులు ఉన్నాయి? అసలు ఆసుపత్రులలో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించవచ్చా? ఇప్పటి వరకు ఎంత మంది చిన్నారులకు క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించారు? వారి పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ కే  అవగాహన లేదు. ఆసుపత్రిలో జరుగుతున్న ఇలాంటి చట్టవిరుద్దమైన వ్యవహారాల పై ఉన్నతాధికారులు కఠినంగా వ్యవరించి లోతైన విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: