కృష్ణానది కరకట్ట పేదలకు భారీ ఆఫర్‌ని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.  కట్టమీద, కరకట్టలోపల, కాల్వ గట్ల మీద ఉంటున్న వారికి ఇళ్లు నిర్మించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఉగాది నాటికి వాళ్లు కోరుకున్న ప్రాంతంలోనే ఇళ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జగన్‌.


కరకట్ట మీదున్న అక్రమ నిర్మాణాలు కూల్చివేతలో ఇళ్లు నష్టపోయే.. పేద ప్రజలకు న్యాయం జరిగేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారికి శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం. ఇళ్ల నిర్మాణం కింద ప్రస్తుతం ఇస్తున్న సెంటున్నర కాకుండా కనీసం 2 సెంట్లు విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఏపీ సర్కార్‌ నిర్ణయించింది. అదే విధంగా వారు కోరుకున్న ప్రాంతంలోనే ఇళ్ల నిర్మాణం చేసి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు జగన్‌. 


పర్యావరణ పరిరక్షణ, నదీ చట్టాలను పటిష్టంగా అమలు చేయడంతో పాటు వీటి కారణంగా పేదలు, సామాన్యులు ఇబ్బంది పడకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జగన్‌. ఉగాది నాటికి పట్టాలు ఇవ్వడమే కాకుండా మంచి డిజైన్లలో వారికి ఉచితంగా ఇళ్లు కట్టి ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ భూములలో సుదీర్ఘ కాలంగా ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరద నీరు ప్రవహించే మార్గాలలో నిర్మాణాలు చేపడితే.. పరిస్థితులు దుర్భరంగా తయారవుతాయన్నారు జగన్‌. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాల్ని ప్రభుత్వం తీసుకుంది. ఇటీవల కరకట్టపై అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్న జగన్ సర్కార్.. పేదలపై జాలి చూపిస్తోంది. వాళ్లకు సొంత ఇల్లు కట్టించి వారి ముఖాల్లో చిరునవ్వులు చూడాలని భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఉగాది పండుగను మంచి రోజుగా ఎంచుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: