తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. బస్సులకు బ్రేకులు పడ్డాయి, డిమాండ్లపై కార్మికులు మెట్టుదిగలేదు. సర్కారు వేసిన ఐఏఎస్ అధికారుల కమిటీ.. ఆర్టీసీ సమ్మెను నివారించలేకపోయింది. అసలు చర్చలు విఫలం కావడానికి కారణాలేంటీ ? అధికారుల కమిటీ ఏం చెప్పింది? కార్మిక నేతలు ఏం పట్టుబడుతున్నారు ? చివరికి ఎవరి పంతం నెగ్గుతోంది ?
రోజుకు 13 కోట్ల ఆదాయం.. ఇంతటి బలమైన కార్పొరేషన్ ఇబ్బందుల్లో పడింది. ఆర్టీసీ కార్మికులకు ప్రతి నాలుగేళ్లకు ఒకసారి పీఆర్‌సీ అమలు చేయాల్సి ఉంది. పీఆర్‌సీ అమలు గడువు ముగిసి ఏడాదిన్నర దాటింది. ఇప్పటి వరకు కొత్త పీఆర్‌సీని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించలేదు. పక్క రాష్ట్రం ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. దీంతో తెలంగాణ ఆర్టీసీని కూడా విలీనం చేయాలని పట్టుబడుతున్నారు. 26 డిమాండ్లతో ఆగస్టు 30వ తేదీన ఆర్టీసీ కార్మిక సంఘాలు యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చాయి. ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీని, ఛైర్మన్‌ను నియమించలేదు. ముఖ్యమంత్రే ఆర్టీసీ వ్యవహారాలు చూస్తున్నారని రవాణా
మంత్రి కూడా చేతులు ఎత్తేశారు. దీంతో కార్మికుల సమ్మె నోటీస్ ను లైట్ తీసున్నారు.
ముగ్గురు ఐఏఎస్ అధికారులు సోమేశ్‌కుమార్, సునీల్‌శర్మ, రామకృష్ణరావుతో వేసిన కమిటీ , కార్మిక సంఘాల నేతలతో పలుమార్లు చర్చించింది.కార్మికుల డిమాండ్ లను అధ్యయనం చేయడానికి గడువు కావాలని కోరింది. దసరా, బతుకమ్మ పండగా సందర్భంగా ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా సమ్మెను వాయిదా వేసుకోవాలని ఐఏఎస్ అధికారులు సూచించారు. డిమాండ్ల పరిష్కారంపై నిర్ధిష్టమైన హామీ, గడువు చెప్పకుండా సమ్మె ఎలా విరమించాలని ప్రశ్నిస్తున్నారు కార్మిక సంఘాల నేతలు. ఆర్టీసీ పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని, బడ్జెట్‌లో కేటాయించిన నిధులకు అదనంగా ఆర్టీసీకి అందజేస్తున్నామని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు తెలిపారు.
మరోవైపు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. ప్రైవేటు బస్సులను, ఆర్టీసీ అద్దె బస్సులను నడపి ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా చేస్తామని ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సునీల్‌శర్మ ప్రకటించి ఆ దిశగా అడుగులు వేశారు. కానీ వచ్చిన ఆ అరకొర బస్సుల్లో ఎక్కేందుకు ప్రయాణీకులు నానా తంటాలు పడుతున్నారు. సమ్మెకు వెళ్లిన కార్మికులపై కొరఢా ఝుళిపించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఎస్మా చట్టాలు ప్రయోగించినా భయపడేది లేదని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. మొత్తానికి కార్మిక సంఘాల పంతాలు, ప్రభుత్వ పట్టింపులు ఎలా ఉన్నా... ప్రజారవాణాకు మాత్రం ఇబ్బందులు తప్పవు.