ప్రధాని మోడీ త్వరలో మంత్రి వర్గ విస్తరణ చేయబోతున్నారు. మంత్రి పదవుల కోసం బీజేపీ నేతలు పోటీపడటం సహజం. కానీ బీజేపీ నేతల కంటే ఎక్కువగా టీడీపీ అధినేత చంద్రబాబు ఓ బీజేపీ నేత కోసం లాబీయింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రెండో దఫాలో 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న మోడీ.. త్వరలోనే మంత్రివర్గ విస్తరణతో మరింత పట్టుబిగించాలని చూస్తున్నారట.
ఇప్పటికే తెలంగాణా నుంచి కిషన్ రెడ్డి కేబినెట్ లో స్థానం దక్కించుకున్నారు. ఏపీకి ఇంతవకూ ప్రాతినిధ్యం లేదు. విస్తరణలో మాత్రం ఏపీకి స్థానం ఉంటున్న నేపథ్యంలో కేబినేట్ రేసులో కొందరి పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణ, జీవీఎల్ నరసింహారావులకు అవకాశం దక్కచ్చని ఓ అంచనా. టీడీపీ నుంచి సుజనాకి మంత్రి పదవి ఇస్తారని టీడీపీ తెగ ప్రచారం చేయాలనుకుంది కానీ బీజేపీ నేతల నెగిటివ్ కామెంట్స్ తెలుగు తమ్ముళ్ల ఆశలకు గండి కొట్టాయి.
అందుకే బాబు తన నేరచరిత ఎంపీల పేర్లు పక్కకు పెట్టి తాజాగా.. సురేష్ ప్రభు పేరు తెరపైకి తెస్తున్నారట. ఏపీ కోటాలో రాజ్యసభ సభ్యుడైన సురేష్ ప్రభు గతంలో రైల్వే మంత్రిగా పనిచేసారు. నిజానికి చంద్రబాబుకు అనుకూలంగా ఉండే సుజనాకు అవకాశం ఇవ్వకపోవడం ద్వారా బీజేపీ టీడీపీతో పొత్తుకు సిద్ధంగా లేనన్న సంకేతాలు ఇచ్చేసింది. అయితే సురేష్ ప్రభు కి మాత్రం తప్పక అవకాశం ఉంటుందనే వాదన వినిపిస్తోంది.
అవ్వడానికి బీజేపీ నేతే అయినా టీడీపీకి, చంద్రబాబుకు సపోర్టర్ గానే ఉన్నారు సురేష్ ప్రభు. 2018లో మోదీతో యుద్ధం అంటూ చంద్రబాబు హడావిడి చేస్తున్న సమయంలో, తన మంత్రులతో, ఎంపీలతో ప్రధాని మోదీపై అనుచిత వాఖ్యలు చేయిస్తున్న సమయంలో కూడా సురేష్ ప్రభు విశాఖ భాగస్వామ్య సదస్సుకు వచ్చి మరీ చంద్రబాబును పొగిడి వెళ్లాడు.
ఫిరాయింపు ఎంపీలతో మోదీని ఒప్పించలేమని అర్థమయ్యాకే బాబూ ఈ దొడ్డిదారి ప్రయత్నాలు మొదలెట్టాడని చెబుతున్నారు. తనకు సన్నిహితులైన బీజేపీ నేతల ద్వారా సంధి ప్రయత్నాలకు విశ్వప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు.