మొన్నటి
ఎన్నికల్లో వైసిపి కొట్టిన దెబ్బకు చాలామంది తెలుగుదేశంపార్టీ నేతలకు పిచ్చి పట్టినట్లుంది.
ఆ విషయం చంద్రబాబునాయుడు విశాఖపట్నం జిల్లా పర్యటనలో స్పష్టంగా బయటపడింది.
విశాఖపట్నం నగరంలో ఏర్పాటు చేసిన పార్టీ విస్తృతస్ధాయి సమావేశంలో మాజీ మంత్రి
చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ చంద్రబాబును ఎవరూ మాజీ ముఖ్యమంత్రి అనొద్దంటూ
ఆదేశించారు.
తెలుగుదేశంపార్టీకి సంబంధించినంత వరకూ చంద్రబాబే మనకు ముఖ్యమంత్రి అంటూ చింతకాయల చెప్పటంతో కొందరు సీనియర్ నేతలు ముందు ఆశ్చర్యపోయారు. చింతకాయల మాటలకు చంద్రబాబు ఫుల్లుగా ఖుషీ అవటం గమనించిన కొందరు నేతలు తాము కాదనటం ఎందుకులే అనుకున్నారో ఏమో ? అందుకనే సిఎం చంద్రబాబు జిందాబాద్ అంటూ కార్యకర్తలకు జేజేలు కొట్టించారు.
వేదిక మీద జరుగుగుతన్న తంతగంతో పాటు కార్యకర్తల జేజేలు చూసిన కొంతమందికి మాత్రం టిడిపి సీనియర్లలో కొందరికీ పిచ్చి ముదిరిపోయిందనే అనుమానాలు వచ్చేశాయి. ఎన్నో డక్కా మొక్కీలు తిన్న అయ్యన్నపాత్రుడు లాంటి సీనియర్ నేతలే ఇలాంటి పిచ్చి కూతలు కూస్తుంటే ఏమనాలో అర్ధం కావటం లేదు.
సరే చంద్రబాబుతో పాటు వేదికమీదే కూర్చున్న మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లాంటి కొందరు మాత్రం ఏమీ మాట్లాడలేదనుకోండి అది వేరే సంగతి. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తన భుజాలను తానే చరుచుకునే చంద్రబాబు కూడా అయ్యన్న మాటలకు ఒకటే పొంగిపోవటం మరింత ఆశ్చర్యంగా ఉంది.
ఎన్నికల ఫలితాలు వచ్చిన కొత్తల్లోనే పాలొట్ బ్యూరో సభ్యురాలు, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కూడా ఇలాగే మాట్లాడి అబాసుపాలయ్యారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తాను గుర్తించనని చంద్రబాబే సిఎం అంటూ గల్లా చేసిన కామెంట్ ను అప్పట్లో అందరూ తప్పు పట్టారు. ఐదేళ్ళు ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడే చాలామంది చిత్తుగా ఓడిపోయారు. జగన్ ను సిఎంగా అంగీకరించటానికి చంద్రబాబు ఇష్టపడటం లేదని తెలుసుకున్న నేతలు తమ సిఎం చంద్రబాబే అంటున్నారంటే పిచ్చి ముదిరిపోవటం కాక మరేమిటి ?