గడచిన పది రోజులుగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు అధికార టిఆర్ఎస్ ఎంపి కె కేశవరావు మద్దతు ప్రకటించారు. ఒకవైపు సమ్మెను అణిచి వేసేందుకు కెసియార్ ప్రయత్నిస్తున్న సమయంలోనే కార్మికులకు తాను సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్లు స్వయంగా కెకె ప్రకటించటం విచిత్రంగా ఉంది.

 

సమ్మె విషయంలో తాజాగా కెకె ప్రకటన చూస్తుంటే అధికార పార్టీలోకి ఇంకా చాలామంది ప్రజా ప్రతినిధులు కార్మికులకు మద్దతుగా నిలుచున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి. సమ్మెకు మద్దతు తెలుపుతు బహిరంగంగా ప్రకటించిన మొదటి వ్యక్తి మాత్రం కెకెనే అనటంలో సందేహం లేదు. ఒకవైపు కెసియార్ కు వ్యతిరేకంగా కార్మికులకు మద్దతుగా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి చేరుకున్నాయి.

 

అదే సమయంలో అధికారపార్టీ నుండి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు మరో ఇద్దరు, ముగ్గురు మంత్రులు మాత్రమే  సమ్మెను విరమించుకోవాలంటూ విజ్ఞప్తులు చేశారు. అంతే కానీ హోలు మంత్రివర్గం కానీ ఎంపిలు, ఎంఎల్ఏలు కనీస మాత్రంగా కెసియార్ కు పూర్తి మద్దతు ప్రకటించలేదు. ఎందుకంటే వారికి కూడా కెసియార్ వైఖరి ఏమాత్రం నచ్చలేదట.

 

అయితే బహిరంగంగా కెసియార్ ను తప్పుపడితే తమ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశ్యంతో ఎవరికి వారుగా మాట్లాడకుండా ఉండిపోయారు. ఈ నేపధ్యంలోనే కార్మికులకు మద్దతుగా కె కె ప్రకటించటంతో అందరూ ఆశ్చర్యపోయారు. తాను సోషలిస్టునని చెప్పుకున్న కెకె తన మద్దతు ప్రభుత్వానికి కాక కార్మికులకే ఉంటుందని చెప్పటం పార్టీ, ప్రభుత్వంలో ఓ రకంగా సంచలనంగా మారిందనే చెప్పాలి.


కార్మికులకు ప్రభుత్వానికి మధ్య వర్తిత్వం చేస్తానని ఎప్పుడూ చెప్పలేదన్నారు. మధ్య వర్తిత్వం చేయమని తనను ఎవరూ కోరలేదని చెప్పటం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే రెండు రోజులుగా ప్రభుత్వం తరపున కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతానని కెకె చెప్పినట్లుగా విస్తృతంగా ప్రచారమైంది. దాన్ని ఇపుడు కెకె ఖండించారు లేండి.


జరుగుతున్న ప్రచారం మొత్తం తప్పన్నారు. సమ్మె విషయమై మాట్లాడేందుకు తాను సిఎం అపాయిట్మెంట్ కోరానని అయితే ఇంకా దొరకలేదని కూడా కెకె చెప్పటం గమనార్హం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: