తుపాను బీభత్సానికి జపాన్ అతలాకుతలమైంది. ఉప్పెన వచ్చి వెళ్లి నాలుగురోజులైనా ఇంతవరకూ.. ఈ ఆసియా సూపర్ పవర్ కుదుటపడలేదు. మృతుల సంఖ్య 70కి చేరగా.. లక్షలాది మంది కరెంటు, నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. దేశవ్యాప్తంగా 36 జిల్లాలపై ఉప్పెన ప్రభావం పడింది. 2011 సునామీ తర్వాత జపాన్ తొలిసారి రిజర్వ్ ఫోర్సును కూడా రంగంలోకి దించాల్సి వచ్చింది. 


జపాన్ లో హెజిబిస్ తుఫాన్ సృష్టించిన ఉత్పాతం అంతాఇంతా కాదు. దాదాపు 216 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులతో కూడిన హోరువాన.. చాలా పెద్ద నష్టాన్నే మిగిల్చింది. 176 నదుల కరకట్టలు తెగడంతో.. జపాన్ లో ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. చుట్టూ సముద్రపు నీటితో ఉండే జపాన్ లో.. ఇప్పుడు ఎక్కడ చూసినా వరదనీటిలో నానుతున్న ఇళ్లే కనిపిస్తున్నాయి.


లక్షా పది వేల మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు 3 వేల మందిని ఉప్పెన నుంచి కాపాడామని జపాన్ ప్రధాని  షింజో అబే ప్రకటించారు. ఉప్పెన కారణంగా 70 మంది చనిపోగా, 18 మంది గల్లంతయ్యారు. 2011 తర్వాత తొలిసారి రిజర్వ్ ఫోర్స్ ను కూడా రంగంలోకి దించింది జపాన్. రిజర్వు దళాలు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. 


వరద సృష్టించిన సమస్యల నుంచి జపాన్ ఇప్పుడప్పుడే బయటపడేలా లేదు. ఆర్థిక సమస్యలు చాలాకాలం పాటు ఉంటాయని భావిస్తున్నారు. ఉప్పెన ప్రభావిత ప్రాంతాల్లో అందర్నీ ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఫుకుషిమా అణు కర్మాగారం నుంచి సేకరించిన పది బ్యాగుల వ్యర్థాలు వరదలో కొట్టుకుపోవడంతో.. అందరిలో ఆందోళన వ్యక్తమౌతోంది. ఆరు బ్యాగులు దొరికినా.. మరో నాలుగు బ్యాగులు మిస్సయ్యాయి. రేడియా ధార్మికత నీటిలో కలిస్తే కొత్త రోగాలు వస్తాయనే ఆందోళన ఉన్న తరుణంలో.. ఎవరూ భయపడాల్సిన పనిలేదంటోంది జపాన్ సర్కారు. ఉప్పెన శాంతించినా.. కొన్ని రోజుల పాటు అలర్ట్ గానే ఉండాలని ప్రజలకు సూచిస్తోంది. వరద  ప్రభావం జపాన్ లో జరగాల్సిన స్పోర్ట్స్ ఈవెంట్లపై కూడా పడింది. జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ వాయిదా పడగా.. రగ్బీ వాల్డ్ కప్ లో మూడు మ్యాచ్ లు రద్దయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: