తెలుగుదేశంపార్టీ నేతలకు
రాబోయే దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని బిజెపి బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ
పార్టీలో ఎవరైనా చేరదలుచుకుంటే వెంటనే పార్టీని సంప్రదించాలని ఏపి ఇన్చార్జి
సునీల్ ధియోధర్ మీడియా సమావేశంలో ప్రకటించారు. తమ పార్టీలో చేరదలచుకున్న వారు
మొహమాట పడాల్సిన అవసరం కూడా లేదన్నారు.
ఇప్పటికే కొందరు మంచి నేతలు టిడిపికి రాజీనామా చేసి బిజెపిలో చేరారని సునీల్ చెప్పటం గమనార్హం. చంద్రబాబునాయుడు నాయకత్వంలోని పార్టీ హెల్ప్ లెస్ అండ్ హోప్ లెస్ పార్టీగా మారిపోయిందన్నారు. సరే ఈ విషయంలో నిజం లేకపోలేదనుకోండి అది వేరే సంగతి.
అయినా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వచ్చే ఎన్నికల్లో తామే ప్రధాన ప్రత్యర్ధి అంటూ తన భుజాలను తానే చరుచుకుంటున్న పార్టీ కూడా రండి బాబు రండి మా పార్టీలో చేరమని బహిరంగంగానే టిడిపి నేతలను అడుక్కోవటం విచిత్రంగానే ఉంది. ఏపిలో బిజెపి అంత బలంగా ఉందని ఇతర పార్టీల్లోని నేతలు గనుక అనుకుంటే వారిని ఎవరూ బొట్టు కాటుక పెట్టి పిలవాల్సిన అవసరమే లేదు.
ఇంతచిన్న విషయాన్ని సునీల్ ఎలా మరచిపోయారో అర్ధం కావటం లేదు. మొన్నటి ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్ధానాలకు పోటి చేసిన బిజెపి నేతల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా కనీసం డిపాజిట్ కూడా రాలేదు. పైగా చాలా నియోజకవర్గాల్లో బిజెపికి వచ్చిన ఓట్లకన్నా నోటా (నన్ ఆఫ్ ది ఎబౌ)కు పోలైన ఓట్లే ఎక్కువన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో కూడా బిజెపి ఒక్క సీటులో కూడా గెలిచే చాన్సే లేదు. బిజెపిలో చేరిన టిడిపి నేతల వల్ల ఎక్కడైనా గట్టి పోటి ఇస్తే ఇవచ్చు అంతే. తెలంగాణాలో ఏం జరిగిందో అందరూ చూసిందే. కాంగ్రెస్, టిడిపిల నుండి బిజెపిలో చేరి మొన్నటి ఎన్నికల్లో పోటి చేసిన వారిలో ఒక్కరు కూడా గెలవలేదు. ఆదిలాబాద్ ఎంపిగా గెలిచిన సోయం బాబురావు కూడా బిజెపి వల్ల గెలవలేదు. గిరిజనుల్లో ఏర్పడిన చీలికల వల్లే విజయం సాధించారు. కాబట్టి ఏపి బిజెపి పరిస్ధితిలో పెద్దగా మార్పేమీ ఉండదని సునీల్ లాంటి నేతలు గుర్తిస్తే బాగుంటుంది.