ఏపీలో పిట్టపోరు మళ్లీ మొదలైంది. అధికార, ప్రతిపక్ష నేతలు ట్వీట్ల దాడికి మళ్లీ దిగుతున్నారు. చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ట్వీట్‌తో కామెంట్ చేస్తే.. నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌పై మాటల దాడి పెంచారు.
ఆంధ్రప్రదేశ్ లో ట్వీట్ల రాజకీయం మళ్లీ షూరూ అయింది. ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. ప్రతిరోజు కనీసం మూడు గంటలైనా మైకులో మాట్లాడకపోతే చంద్రబాబుకు భోజనం సహించదు.. నిద్ర పట్టదని సెటైర్ వేశారు. ఎక్కడకు వెళ్లినా.. కమెడియన్ తరహాలో కార్యకర్తలను ఆహ్లాదపరచడంపైనే చంద్రబాబు దృష్టిపెట్టినట్టు ఉన్నారని ట్వీటారు. ఎవరిచ్చారు మీకీ అధికారం అంటూ ప్రభుత్వాన్ని పదే పదే ప్రశ్నిస్తుంటే ప్రజలు నవ్వుతున్నారని సోషల్ మీడియాలో ఆరోపించారు విజయసాయిరెడ్డి.
మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్‌లో మాటల వేడి పెంచారు. జగన్ సర్కార్‌పై సెటైర్లు వేశారు. పాదయాత్రలో కోటి 70 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి.. యువతను ఉద్ధరించేస్తానన్న మీరు.. ఇప్పుడు వాళ్ల మీద క్రిమినల్ కేసులు పెట్టి... పైశాచిక ఆనందం పొందుతున్నారా..? అంటూ ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం అనంతపురంలో ధర్నా చేసిన 22 మంది నిరుద్యోగులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ట్వీట్టర్‌లో డిమాండ్ చేశారు నారా లోకేష్. నిరుద్యోగులపై అంత కక్ష ఎందుకని ట్వీట్ చేశారు లోకేష్. రాష్ట్రంలో కొద్ది కాలంగా సైలంట్‌గా ఉన్న ట్వీట్ వార్ మళ్లీ జోరందుకుంది. నేతలు ఒకరి మీద మరొకరు సెటైర్లు వేసుకుంటూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు.
మొత్తానికి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో టీట్ల వార్ జరుగుతోంది. ఏ చిన్న విషయం దొరికినా దాన్ని టీట్లతో సాగదీస్తూ రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారు నేతలు. ముఖ్యంగా వైసీపీ నేత విజయసాయి రెడ్డి, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ మధ్యే ఈ మాటల యుద్ధం జరుగుతోంది. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా సాగుతోంది. మరి ఈ ట్వీట్లకు ఎపుడు పుల్ స్టాప్ పడుతుందో చూడాలి.