ముఖ్యమంత్రయిన నాలుగు మాసాలకే జగన్మోహన్ రెడ్డి పేరు ఇతర రాష్ట్రాల్లో కూడా మారుమోగిపోతోంది. సరే దేశవ్యాప్తంగా పేరొస్తోందంటే కొందరికి అసూయగా ఉంటుంది. మరికొందరు అభినందిస్తుంటారు లేండి. కానీ విచిత్రమేమిటంటే జగన్ పేరు చెబితే ఇపుడు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసియార్ మండిపోతుంటే కొన్ని రాష్ట్రాల సిఎంలు మాత్రం జగన్ ను  అభినందిస్తున్నారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని జగన్ తీసుకున్న నిర్ణయం తెలంగాణాలో ఎంతటి ప్రకంపనలు సృష్టిస్తోందో చూస్తున్నదే. ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కౌలు రైతులకు రైతుభరోసా పథకం వర్తింపు, గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగాల భర్తీ లాంటి నిర్ణయాలు కెసియార్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.  

 

ఇక పిపిఏల సమీక్ష అంశంపై జాతీయస్ధాయిలో మొదలైన రచ్చ అంతా ఇంతా కాదు. చంద్రబాబునాయుడు హయాంలో సోలార్, విండ్ పవర్ ధరల ఒప్పందాలను సమీక్షించాలని జగన్ నిర్ణయించారు. దాంతో రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్ర ఇందన శాఖ మంత్రి ఆర్కె సింగ్ ఎంత రచ్చ చేస్తున్నది అందరూ చూస్తున్నదే. అయితే విషయం ఏమిటంటే జగన్ ను ఆదర్శంగా తీసుకుని ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాధ్ కూడా పిపిఏల సమీక్షకు నిర్ణయించారు. దాంతో కేంద్రానికి నోరు పడిపోయింది.

 

ఇక పరిశ్రమల్లో స్ధానికులకే 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని జగన్ చట్టం చేశారు. ఆ చట్టంపై చంద్రబాబు, బిజెపి నేతలు ఎంత యాగీ చేశారో చెప్పాల్సిన పనిలేదు. అయితే జగన్ నిర్ణయాన్ని తమిళనాడులోని రాజకీయ పార్టీలు స్వాగతించాయి.  తాజాగా కర్నాటక, మహారాష్ట్ర, బీహార్ లో కూడా జగన్ నిర్ణయంపై చర్చలు జోరందుకున్నాయి.

 

అదే విధంగా ప్రజాధనం ఆదా చేయాలన్న ఉద్దేశ్యంతో ఇరిగేషన్ తదితర శాఖల్లో రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయాలని జగన్ నిర్ణయించారు. యధా ప్రకారం రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నీ మండిపోతున్నాయి. అయితే జగన్ అమలు చేస్తున్న రివర్స్ టెండర్ విధానం చాలా బాగుందంటూ కర్నాటకలోని బిజెపి ప్రభుత్వం స్వాగతిస్తోంది. మొత్తం మీద సిఎం అయిన నాలుగు నెలలకే జగన్ పేరు ఇతర రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: