ఏపీలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్టవ్య్రాప్తంగా 20లక్షల మంది అర్హులను ఇప్పటి వరకు గుర్తించినట్లు ప్రభుత్వం చెబుతోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై సీఎం జగన్ ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఈ విషయం చెప్పారు. అర్హులైన పేదలందరికి ఇళ్ళు నిర్మిస్తామని, పట్టణ ప్రాంతాల్లో అవకాశం ఉన్న మేరకు వ్యక్తి గత ఇళ్ళు నిర్మాణం చేసి ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.


పట్టణాల్లో ఒక సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలంలో ఇళ్ళు నిర్మాణం చేపట్టనున్నారు.జి ప్లస్ ఇళ్ల నిర్వహణ ఇబ్బందిగా ఉండటంతో వ్యక్తిగత ఇళ్ళు ఇవ్వాలని నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో 8లక్షల మంది ఇళ్ల కోసం అర్హులు ఉన్నారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అందుకే భూమి కొనుగోలుకు పది నుంచి 12 వేల కోట్లు అవసరం కానుంది.


వచ్చే ఉగాది నాటికి లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ప్రధానమంత్రి అవాస్ యోజన పథకాన్ని అనుసంధానం చేసి ఇళ్ళు నిర్మించనున్నారు.పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంలో లబ్దిదారుల నుంచి ఒక్క పైసా కూడా తీసుకోకుండా వందశాతం ఉచితంగా ఇంటి నిర్మాణం ప్రభుత్వం చేసి ఇస్తుంది. రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించిన ఇళ్ల మరమ్మతులు కూడా చేయాలని సీఎం ఆదేశించారు.


సబ్ కమిటీ భేటీ తరువాత జర్నలిస్టుల ఇంటి స్థలాల పై స్పష్టత వస్తుంది. ఏపీ టిడ్కో ప్రాజెక్టు ల్లో ధరలు చెల్లించాలని భావిస్తున్నారు. 50 వేల యూనిట్ల లో రివర్స్ టెండరింగ్ కు వెళ్తున్నట్లు ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఏదేమైనా వచ్చే ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీ పూర్తయితే అదో రికార్డుగా నిలిచే అవకాశం ఉంది. రికార్డుల కోసం కాకపోయినా సామాన్యుడి సొంతింటి కల నెరవేరాలని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: